హస్తకళా రూపశిల్పి అయిల ఆచారి ఇక లేరు

25 Jan, 2016 04:30 IST|Sakshi
హస్తకళా రూపశిల్పి అయిల ఆచారి ఇక లేరు

జనగామ: ప్రసిద్ధి పొందిన పెంబర్తి హస్తకళలకు ఆద్యుడు అయిల ఆచారి(80) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. వరంగల్ జిల్లా జనగామ మండలం పెంబర్తికి చెందిన అయిలా చారి హస్తకళలకు జీవం పోసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. 1936 సెప్టెంబర్ 9న అయిల అంబయ్యచారి, కనకమ్మల మొదటి సంతానంగా జన్మించిన అయిల ఆచారి హస్తకళా నైపుణ్యంలో తనదైన ప్రతిభ చాటా రు. గావ్(కూజా) తయారు చేసిన ఆచారికి నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 1979-80లో జాతీయ అవార్డును ప్రదానం చేశారు. ఆల్ ఇండియా హ్యాండీ క్రాఫ్ట్ బోర్డు నుంచి 1971, 1977లో రెండుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు.

మాజీ ప్రధాను లు ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు, మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్, మాజీ గవర్నర్లు కుముద్‌బెన్‌జోషీ, శంకర్‌దయాళ్‌శర్మ తదితర ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. పెంబర్తి బ్రాస్ సొసైటీ రూపకల్పనకు ఆయన చేసిన కృషి, నేటితరానికి బం గారు భవిష్యతును అందిస్తోంది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ధ్వజ స్తంభాలు, కిరీటాలు, మూల విరాట్టు లు, త్రిశూలం లాంటి ఎన్నో బ్రాస్ కళా ఖండాలు  ఆచారి చేతిలో మలిచినవే. సినీ రంగం ఏటా అందించే నంది అవార్డులు కూడా ఆయన రూపకల్పన చేసినవే. అయిలా చారి 1977 నుంచి 1981 వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) మద్రాసు బ్రాంచ్ డెరైక్టర్‌గా, 1987 నుంచి 89 వరకు ఏపీ ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్‌బోర్డు డెవలప్‌మెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. 1968 నుంచి 2006 వరకు బ్రాస్ కళాఖండాలను తయారు చేసిన ఆచారి ఆ తర్వాత విరమణ పొందారు. ఆయనకు భార్య శకుంతల, కుమారుడు సురేష్ ఉన్నారు. అయిలచారి తండ్రి అంబయ్యచారి కూడా కళాకారుడే.

మరిన్ని వార్తలు