రుణమే యమపాశమై

18 Jul, 2015 03:06 IST|Sakshi
రుణమే యమపాశమై

రుణమే ఆ రైతు పాలిట యమపాశమైంది. గతేడాది వర్షాభావ పరిస్థితులతో దిగుబడి రాకపోవడంతో అప్పులే మిగిలాయి. ఖరీఫ్ సీజన్‌లో సాగు చేస్తున్న పంటలు వానలు కురవకపోవడంతో ఎండుముఖం పట్టాయి. ఇక అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన అన్నదాత పురుగులమందు తాగి ఉసురు తీసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లిలో చోటుచేసుకుంది.
 
 మర్పల్లి : మృతుడి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..రావులపల్లికి చెందిన బొర్ర పెంటయ్య (33) తన తండ్రి నారాయణ పేరుమీదున్న నాలుగు ఎకరాలతో పాటు స్థానిక పితాంభరేశ్వర ఆలయానికి చెందిన 5 ఎకరాల భూమిని ఏడాదికి రూ. 1 లక్షకు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది సాగుచేసిన పంటలు వర్షాభావ పరిస్థితులతో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో రూ. 2 లక్షల వరకు అప్పులయ్యాయి.

జూన్ మొదటి వారంలో కురిసిన ఓ మోస్తారు వర్షాలకు పెంటయ్య 3 ఎకరాల్లో పత్తి, ఎకరం పొలంలో పసుపు, మరో 3 ఎకరాల్లో మొక్కజొన్న, కంది, 2 ఎకరాల్లో పెసర, మినుము పంటలు సాగు చేశాడు. పెట్టుబడి, ఇతర కుటుంబ అవసరాల కోసం తెలిసి వారి వద్ద రూ. 1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. స్థానిక సహకార సంఘంలో రూ. లక్ష అప్పు చేశాడు. గతంలో కొంతమేర రుణమాఫీ అవడంతో పెంటయ్య తిరిగి అప్పు తీసుకున్నాడు. ఇటీవల ప్రకటించిన రుణమాఫీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదు. నెల రోజులుగా వర్షాలు కురువకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయి.

ఈ ఏడాది పంటలు ఆశించిన స్థాయిలో పండితే అప్పులు తీర్చవచ్చని రైతు భావించాడు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో అప్పులు తీరేమార్గం లేదని పెంటయ్య మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలో గురువారం సాయంత్రం పొలానికి వెళ్లి పురుగులమందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత ఆయన తండ్రి నారాయణ  పొలానికి  వెళ్లి చూడగా పెంటయ్య అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. దీంతో నారాయణ స్థానికుల సాయంతో కొడుకును చికిత్స నిమిత్తం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో వికారాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో పెంటయ్య మృతి చెందాడు.

మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు ప్రశాంత్, తల్లిదండ్రులు నారాయణ, నాగమ్మ ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న పెంటయ్య మృతితో కుటుంబీకులు గుండెలలిసేలా రోదించారు. అందరితో కలుపుగోలుగా ఉండే పెంటయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది. శుక్రవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు ఏఏస్‌ఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ కమలమ్మ కోరారు.

మరిన్ని వార్తలు