ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన

24 May, 2017 03:23 IST|Sakshi
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన

- జగిత్యాల జిల్లాలో కదం తొక్కిన అన్నదాత
- 3 గంటలపాటు రాస్తారోకో


జగిత్యాల అగ్రికల్చర్‌/జగిత్యాల రూరల్‌: అన్నదాతకు కోపమొచ్చింది. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడం.. అధికారులెవరూ స్పందించకపోవడంతో రోడ్డెక్కారు. సుమారు మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. దీంతో మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. బాధితుల్లో గర్భిణి.. ఫిట్స్‌తో బాధపడుతున్న చిన్నారి.. మంటలార్పడానికి వెళ్తున్న ఫైరింజన్‌ కూడా ఉంది. ధాన్యం కొనాలని జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల– నిజామాబాద్‌ రహదారిపై అన్నదాతలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో భారీ ధర్నా.. రాస్తారోకో ప్రారంభించారు. జిల్లా కేంద్రం, శివారు ప్రాంతాల్లోని ఐకేపీ, సింగిల్‌ విండో కేంద్రాల్లో లారీల కొరత, సంచుల సమస్యతో ధాన్యం కొనుగోళ్లు చేయడంలేదని జగిత్యాల మండలం కన్నాపూర్, బాలపల్లి, తిప్పన్నపేట, కల్లెడ, అంబారిపేట, చల్‌గల్‌ గ్రామాలరైతులు ఆరోపించారు. 3 గంటలపాటు ఆందోళనను కొనసాగించారు. దీంతో మూడు కిలో మీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఉన్నతాధికారులు వచ్చి సమస్య పరి ష్కరించాలని భీష్మించుకుకుర్చున్నారు. ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు మాత్రమే వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించారు. చివరకు ప్రయాణికులు, మీడి యా ప్రతినిధులు జనం ఇబ్బందులను వివరించడంతో రైతులు శాంతించారు.

చిక్కుకున్న గర్భిణి..
డెలివరీ కోసం జగిత్యాలకు వస్తున్న గర్భిణి నిఖిత, ఫిట్స్‌తో బాధపడుతున్న చిన్నారి ట్రాఫిక్‌లో చిక్కుకొని నరకయాతన అనుభవించారు.   ప్రయాణికులు చివరకు సహనం కోల్పోయి రైతులతో గొడవకు దిగారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు