జాతీయ రహదారి దిగ్బంధం 

17 Feb, 2019 10:50 IST|Sakshi
జాతీయరహదారిపై పెర్కిట్‌ వద్ద బైఠాయించిన రైతులు

ఆర్మూర్‌/పెర్కిట్‌: రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలు, పసుపు పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతులు శనివారం 44వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఆర్మూర్‌ మండలం పెర్కిట్‌ శివారులోని మహిళా ప్రాంగణం ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి మధ్యాహ్నం వంటావార్పు నిర్వహించారు. రాత్రి 9 గంటల వరకు రహదారుల దిగ్భందం కొనసాగింది. మరో వైపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ మండలాల్లో ఉన్న రైతు నాయకులను శుక్రవారం అర్ధరాత్రి వారి ఇళ్లలోనే అరెస్టులు చేసి సమీపంలోని ఇతర మండలాల పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. అయినా రైతులంతా ఏకమై రహదారుల దిగ్బంధాన్ని శాంతియుతంగా నిర్వహించారు.
 
ఆందోళన నేపథ్యంలో నిజామాబాద్‌ సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది పోలీసులు బలగాలు శుక్రవారమే ఆర్మూర్‌కు చేరుకున్నారు. ఆర్మూర్‌ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్‌ కూడళ్లలో, జాతీయ రహదారి కూడళ్లలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు శనివారం ఉదయం నుంచే రైతులు పెద్ద ఎత్తున పెర్కిట్‌ శివారులోని జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. ఆర్మూర్‌ డివిజన్‌ పరిధిలోని 14 గ్రామాల్లో రెండు రోజుల పాటు విధించిన 144 సెక్షన్‌ను లెక్క చేయకుండా రైతులు గ్రామాల నుంచి కార్లు, మోటార్‌ సైకిళ్లపై తరలివచ్చారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి పైగా రైతులు చేరుకొని జాతీయ రహదారిపై భైఠాయించారు.

ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న పంటకు క్వింటాలుకు రూ. 3,500 రూపాయలు, పసుపునకు క్వింటాలుకు రూ. వేల గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు అరెస్టు చేసిన రైతు నాయకులను విడుదల చేయాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 వరకు జాతీయ రహదారులపైనే భైఠాయించారు. మధ్యాహ్నం గ్రామాల వారీగా రైతులు వంట పాత్రలను తెచ్చుకొని రహదారిపైనే పొయ్యిలను ఏర్పాటు చేసుకొని వంటా వార్పు నిర్వహించారు.

అనంతరం అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకు కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. ఈ నెల 7న, 12న ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరస్తాలోని 63వ నంబర్‌ జాతీయ రహదారిపై భైఠాయించి ధర్నా నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని ఆరోపించారు. కలెక్టర్‌ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. రాత్రి 9 గంటలకు ఆందోళన విరమించారు. సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఆ మార్గం గుండా వచ్చే వాహనాలను ఉదయం నుంచే ఇతర మార్గాల గుండా మళ్లించి ప్రయాణీకులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్త పడ్డారు.

పోలీసుల భారీ బందోబస్తు 
2008లో ఎర్రజొన్న రైతుల ఉద్యమం హింసాత్మకంగా మారిన పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో భారీ పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. సిద్దిపేట సీపీ, సంగారెడ్డి, నిర్మల్‌ ఎస్పీలతో పాటు ఆర్మూర్‌ ఏసీపీ రాములు, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సుమారు వెయ్యి మంది పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించాయి. శనివారం ఉదయం నుంచే భారీగా బలగాలను రహదారికి ఇరువైపులా మోహరించారు.

రహదారుల దిగ్భందా న్ని ప్రారంభించే ముందు రైతులతో సీపీ కార్తికేయ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన తెలపాలని సూచించా రు. రాస్తారోకోలు, రహదారుల దిగ్బంధం చేయడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా రైతులు దిగ్భందానికి పూనుకున్నారు. సాయంత్రం సమయంలో ఆర్మూర్‌ ఏసీపీ రాములు సైతం రైతులతో మాట్లాడుతూ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి రైతు నాయకులతో కమిటీలను వేసుకోవాలని సూచించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి కార్యక్రమాలను చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా రైతులు అంగీకరించకుండా రాత్రి వరకు కూడా రహదారిపై భైఠాయించారు. దీక్ష చేస్తున్న రైతులు సహనం కోల్పోయిన ప్రతీసారి పోలీసులు వారిని బుజ్జగిస్తూ శాంతి యుతంగా ఆందోళన చేయడానికి సహకరించారు

అమరవీరులకు నివాళి.. 
ఇటీవల జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రదాడిలో అమరులైన 44 మంది వీర జవాన్ల ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ రైతులు రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం జై జవాన్, జై కిసాన్‌ నినాదాలు చేస్తూ రహదారి దిగ్భందాన్ని ప్రారంభించారు.

ముందస్తు అరెస్టులు.. 
జాతీయ రహదారి దిగ్బంధం
నేపథ్యంలో పోలీసులు పలువురు రైతు నాయకులను శుక్రవారం రాత్రి ముందస్తు అరెస్టులు చేశారు. నాయకుల ఇళ్లకు వెళ్లి అరెస్టు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో దేగాం యాదగౌడ్, ఇటెం జీవన్, మంథని నవీన్‌రెడ్డి తదితరులున్నారు.

పోలీస్‌స్టేషన్‌లకు రైతు నాయకుల తరలింపు
మోర్తాడ్‌: ఎర్రజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఉద్యమబాట పట్టిన రైతాంగాన్ని జాతీయ రహదారుల వైపు వెళ్లకుండా నియంత్రించడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. అయితే తాము శాంతియుతంగానే ఉద్యమాన్ని నిర్వహిస్తామని రైతులు పోలీసులతో స్పష్టం చేశారు. తమ మాట కాదని ఉద్యమానికి అండగా నిలిస్తే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు రైతు సంఘాల నాయకులను హెచ్చరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 12న ఆర్మూర్‌లో రెండోసారి ఆందోళన నిర్వహించిన రైతులు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో శనివారం జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. రెండు జాతీయ రహదారులపై వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసన తెలిసేలా చేయాలని రైతులు భావించారు.

అయితే శనివారం నాటి ఆందోళన కార్యక్రమాలకు రైతులు ఎక్కువ సంఖ్యలో తరలిపోకుండా చూడడానికి పోలీసులు రెండు మూడు రోజుల నుంచి రైతు సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తే తాము చూస్తు ఊరుకోమని పోలీసులు రైతు సంఘాల నాయకులతో స్పష్టం చేశారు. తమపై తీవ్ర ఒత్తిడి ఉందని ఎట్టి పరిస్థితుల్లో రైతులు జాతీయ రహదారుల దిగ్బంధనానికి తరలివెళ్లవద్దని పోలీసులు చెప్పారు. అంతేకాక ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకులను గుర్తించి నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను ధిక్కరించి జాతీయ రహదారుల దిగ్బంధనానికి తరలివెళితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

గతంలో మాదిరిగానే పోలీసులు శనివారం పల్లెలకు చేరుకుని రైతు సంఘాల ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, మోర్తాడ్, మెండోరా, ముప్కాల్, బాల్కొండ, వేల్పూర్‌ తదితర మండలాల్లోని నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి జిల్లా సరిహద్దులోని రెంజల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయినప్పటికీ రైతులు ఎలాంటి బెదురు లేకుండా తమ ఉద్యమాన్ని కొనసాగించడానికి జాతీయ రహదారుల దిగ్బంధనానికి తరలివెళ్లారు. కొందరు రైతులు బైక్‌లపై వెళ్లగా, మరి కొందరు రైతులు డీసీఎం వాహనాల్లో తరలివెళ్లారు. పాలెం రైతుల వాహనాన్ని పోలీసులు మోర్తాడ్‌లో అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రైతుల ఉద్యమాన్ని నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

మరిన్ని వార్తలు