హైదరాబాద్‌కు ఐదో ర్యాంక్‌

14 Aug, 2018 08:40 IST|Sakshi

నివాసయోగ్య నగరంగా గ్రేటర్‌

పెద్ద నగరాల్లో 5వ స్థానం

ఓవరాల్‌గా 27వ స్థానం

సాక్షి, సిటీబ్యూరో:  కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిర్వహించిన ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ /లివబిలిటీ ఇండెక్స్‌–2018లో హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో 27వ స్థానంలభించింది. కేంద్రమంత్రి హరిదీప్‌సింగ్‌పురి సోమవారం విడుదల చేసిన సూచి మేరకు హైదరాబాద్‌ జాతీయస్థాయిలో 27వ స్థానంలో నిలవగా..40 లక్షల పైగా జనాభా కలిగిననగరాల్లో ఐదో స్థానంలో నిలిచింది. గత రెండు సంవత్సరాలుగా వివిధ ఇండెక్స్‌ల్లో.. సర్వేల్లో.. స్వచ్ఛ అంశాల్లో మెరుగైన స్థానాల్లో నిలిచిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) నివాసయోగ్య నగరంగానూ పెద్దనగరాల్లో ఐదో స్థానంలో నిలిచింది. 40లక్షల పైచిలుకు జనాభా నగరాల్లో గ్రేటర్‌ ముంబై మొదటి స్థానంలో నిలవగా, రెండోస్థానంలో చెన్నయ్, మూడోస్థానంలో సూరత్, నాలుగో స్థానంలో అహ్మదాబాద్‌లు నిలిచాయి.

మౌలిక, సామాజిక, ఆర్థిక, సంస్థాగత సూచికలను పరిగణనలోకి తీసుకొని వీటిని ప్రకటించారు. సుపరిపాలన, విద్య, ఆరోగ్యం, ప్రజల రక్షణ, భద్రత, ఆర్థిక, ఉపాధి, గృహనిర్మాణం, సంస్కృతి, బహిరంగ ఖాలీ ప్రదేశాలు, మిక్స్‌డ్‌ లాండ్‌ యూజ్, విద్యుత్, రవాణా, తాగునీటి సరఫరా, ఘనవ్యర్థాల నిర్వహణ, వ్యర్థజలాల నిర్వహణ, కాలుష్యం, తదితర కేటగిరీల్లో సర్వే నిర్వహించి, సమాచారం సేకరించి ఈ ర్యాంకులు ప్రకటించారు. సుపరిపాలన, సంస్థాగత  సూచికల్లో హైదరాబాద్‌  నాలుగో  స్థానంలో నిలిచి తన ప్రాధాన్యతను చాటుకుంది.  విద్యుత్‌ సరఫరాలో ఆరో స్థానంలో, బహిరంగ  ఖాలీ ప్రదేశాలకు సంబంధించి 14వ స్థానంలో నిలిచింది. మిగతా అంశాల్లో 20కన్నా ఎక్కువ స్థానాల్లో ఉంది. 

ప్రభుత్వ మార్గదర్శనంతో..  
నివాసయోగ్య నగరంగా , ప్రజల జీవనప్రమాణాలు పెరిగేందుకు  ప్రభుత్వం చేపడుతున్న వివిధ చర్యలతోనే ఇది సాధ్యమైందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు  ఎస్సార్‌డీపీలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతుండటాన్ని ఈసందర్భంగా ప్రస్తావించారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. పెద్దనగరాల్లో హైదరాబాద్‌ మొదటి ఐదు స్థానాల్లో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ చేపట్టిన  బహిరంగంగా చెత్త వేసే ప్రాంతాల తొలగింపు, ఈ ఆఫీస్‌ నిర్వహణ, ఈజ్‌ఆఫ్‌డూయింగ్‌ బిజినెస్‌ తదితరమైనవి ఇందుకు ఉపకరించాయన్నారు. గత సంవత్సరం కేంద్ర ఆర్థిక శాఖ పట్టణ స్థానిక సంస్థలపై  నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌కు మొదటిస్థానం లభించడం తెలిసిందే. జవాబుదారీతనం, పౌరసేవల్లో సాంకేతికత తదితర అంశాల్లో అప్పుడు టాప్‌గా నిలిచింది.

మరిన్ని వార్తలు