పోటీకి వెళ్లేందుకు పైసల్లేవు

19 May, 2017 02:58 IST|Sakshi

నాసా మెచ్చిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు ఆర్థిక కష్టాలు
సాక్షి, హైదరాబాద్‌: ఎంతో కష్టపడ్డారు, నిరంతరం విద్యనభ్యసిస్తూ కొత్త ప్రయోగాలకు ప్రాణం పోశారు. ‘మరో గ్రహంపై మానవుడికి మనుగడ’ అంశంపై బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు చేసిన ప్రయోగాన్ని నాసా గుర్తించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు అమెరికాలో జరిగే నాసా ఎయిమ్స్‌ స్పేస్‌ కాంటెస్టుకు రావాలని ఆ విద్యార్థులకు ఆహ్వానం కూడా పంపింది. కానీ ఏం ప్రయోజనం అక్కడికి వెళ్లి భారత్‌ తరుఫున నాడి వినిపించేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చాయి.

చేసేదేమీ లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తూ గురువారం సచివాలయానికి వచ్చారు. ఇక్కడా వారి ఆశ ఫలించలేదు, గంటల తరబడి సాయం చేసే మంత్రుల కోసం వేచి చూస్తూ నిరాశకు గురైయ్యారు బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు వెంకటేష్, విష్ణుప్రియ, రమ్యశ్రీ, ఆకాష్, ప్రణయ్‌. నాసా ఎయిమ్స్‌ నిర్వహించిన పోటీల్లో వీరంతా ద్వితీయ బహుమతిని పొందారు. వీరు చేసిన ప్రయోగాన్ని అక్కడ చూపించే క్షణం ఆసన్నమైయినప్పటికీ ఆర్థిక సాయం లేక బిక్కుబిక్కుమంటున్నారు.

అమెరికా వెళ్లడానికి ఎంత అవసరం? : ఒక్కో విద్యార్థికి మూడున్నర లక్షల ఖర్చు అవుతుంది. ఈ నిధులు ప్రభుత్వానికి పెద్ద విషయం కాకపోవచ్చు. ఈ మాత్రం నిధులు ఇవ్వడానికి ఎందుకు తాత్సారం చూపుతుందో తెలియడం లేదు. రాష్ట్రం నుంచి నాసాకు విద్యార్థులు ఎంపిక కావటమే పెద్ద గౌరవం. ఇటువంటి వారిని ప్రోత్సహిస్తే తెలంగాణ కీర్తి, ప్రతిష్టలు ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు