నీటితో మండే పొయ్యి

19 Apr, 2015 01:13 IST|Sakshi
నీటితో మండే పొయ్యి

నీటితో మంటలు ఆర్పవచ్చునని అందరికీ తెలుసు. కానీ... నీళ్లంటే.. రెండు వంతుల హైడ్రోజన్, ఒక వంతు ఆక్సిజన్ అని తెలిసిన వారు మాత్రం దాంతో నిప్పు ఎలా పుట్టించాలో ఆలోచిస్తారు. కోచీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని విమల్ గోపాల్, రిశ్విన్, ప్రవీణ్ శ్రీధర్ మాదిరిగా అన్నమాట. హైడ్రోజన్ బాగా మండుతుందని, ఆక్సిజన్ మంటను ఎగదోస్తుందనీ తెలిసిన వీరు... కరెంటు సాయంతో నీటిని అక్కడికక్కడే విడగొట్టి మండించగల ఓ సరికొత్త పొయ్యిని అభివృద్ధి చేశారు. ఇంకోలా చెప్పాలంటే... నీళ్లనే వంటగ్యాస్‌లా మార్చారన్నమాట.

కోచీలోని స్టార్టప్ విలేజ్‌లో వీరు ఇప్పటికే ఓ ఫ్యాక్టరీ కూడా పెట్టేశారండోయ్! ముందుగా హోటళ్లకు అవసరమైన స్టవ్‌లను తయారు చేసి పరీక్షిస్తామనీ, ఆ తరువాత ఈ హైడ్‌గ్యాస్ స్టౌ అందరికీ అందుబాటులోకి తెస్తామనీ అంటున్నారు వీరు. గ్యాస్ అక్కడికక్కడే తయారవుతూండటం వల్ల రవాణా చేయాల్సిన పని లేదు.. మండి పేలిపోతుందన్న భయమూ అక్కరలేదని భరోసా కూడా ఇస్తున్నారు. చూద్దాం... ఎప్పుడు వస్తుందో ఈ నీటి గ్యాస్ స్టౌ!
 

>
మరిన్ని వార్తలు