ఐదున్నర లక్షల పెన్షన్ల నిలిపివేత

30 Jun, 2014 01:53 IST|Sakshi
ఐదున్నర లక్షల పెన్షన్ల నిలిపివేత
  • బయోమెట్రిక్  నమోదుకు రాని పెన్షనర్లు
  • అవి బోగస్ పెన్షన్‌లే అని భావిస్తున్న అధికారులు
  • ఈ లెక్కలన్నీ తేలాకే పెంపుపై సర్కారు నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఐదున్నర లక్షల మందికి పెన్షన్లు నిలిపివేశారు. పెన్షన్లు తీసుకునే వారు విధిగా బయోమెట్రిక్ విధానంలో  తమ చేతివేలి గుర్తులను నమోదు చేసుకోవాల్సిందేనని గ్రామీణాభివృద్ధి శాఖలోని ‘సెర్ప్’ అధికారవర్గాలు స్పష్టం చేశాయి. బయోమెట్రిక్ విధానంలో బొటనవేలి గుర్తు ఇవ్వడానికి లక్షల సంఖ్యలో పెన్షనర్లు ముందుకు రావడం లేదని, నగరాల్లోనే వీరి సంఖ్య అధికంగా ఉందని గుర్తించారు. వీరంతా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పెన్షన్లు పొందుతున్నవారన్న అనుమానంతో అధికారులు పెన్షన్లు నిలిపివేశారు.

    తెలంగాణ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, చేనేత , గీత కార్మికులకు వెయ్యి రూపాయల పెన్షన్, వికలాంగులకు రూ.1,500 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందులోఅర్హులైన వారికి తప్ప.. అనర్హులకు ఈ లబ్ధిచేకూర  రాదన్న ఉద్దేశంతోనే  పెన్షన్లు నిలిపివేసినట్లు సమాచారం. తెలంగాణలో 31 లక్షల మంది వరకు పెన్షనర్లు ఉంటే.. అందులో ఆరున్నర లక్షల వరకు బయోమెట్రిక్ విధానంలోకి రాలేదని, వీరిలో కుష్టురోగులు, మరీ వృద్ధులైనవారి బొటన వేలి గుర్తులను బయోమెట్రిక్ సాఫ్ట్‌వేర్ గుర్తించని వారు లక్ష వరకు ఉన్నారని భావించినా మిగిలిన వారంతా బోగస్ అనే భావన అధికారుల్లో వ్యక్తం అవుతోంది.
     
    కుటుంబాల కంటే.. అధికంగా తెల్లరేషన్‌కార్డులు, గులాబీ కార్డులు ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెల్లరేషన్‌కార్డుల ఆధారంగా గతంలో ఈ పెన్షన్లు మంజూరు చేశారు. నగరాలు, పట్టణాల్లోనే బోగస్ పెన్షనర్లు అధికంగా ఉన్నారని అధికారులు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు నెలకు రూ.రెండు వందల, వికలాంగులకు రూ.500 పెన్షన్ ఇస్తున్నారు.

    ఈ పెన్షన్‌ను భారీగా పెంచనున్న నేపథ్యంలో బయోమెట్రిక్ విధానంలోకి రానివారిని తొలగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇలా చేస్తే.. ఏడాదికి రూ. 660 కోట్ల మేరకు ఆదా అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల అంచనా. సీఎం చంద్రశేఖర్‌రావు పెన్షన్ల పెంపుపై సమావేశం నిర్వహించడానికి ముందుగానే అధికారులు ఈ కసరత్తు ప్రారంభించారు. జూన్‌కు సంబంధించి పెన్షన్‌ను నిలిపివేసినట్లు  అధికారవర్గాలు ధ్రువీకరించాయి. తెలంగాణలో 31,67,013 మంది పెన్షనర్లు ఉండగా.. ఏప్రిల్‌లో 30,89,914 మందికి నిధులు విడుదల చేశారు. అయితే 16,68,059 మందికి మాత్రమే నిధుల పంపిణీ జరగడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు