నిజాం రాజులా వ్యవహరిస్తున్న కేసీఆర్‌

5 Dec, 2017 11:31 IST|Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిజాం రాజు లక్షణాలను పుణికి పుచ్చుకున్నారని, ఆయన నియంతృత్వ పోకడలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్సీ, టీమాస్‌ స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు చెరిపల్లి సీతారాములు మండిపడ్డారు. సోమవారం ఖమ్మంలోని మంచికంటి భవన్‌లో తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాడు తెలంగాణలో చరిత్రాత్మకమైన ఉద్యమం జరిగిందని, ఆ ఉద్యమంలో 4 వేల మంది అమరులయ్యారన్నారు. 

ఆ ఉద్యమానికి కారణం నిజాం రాజు అని, నిజాం రాచరిక పాలనను వ్యతిరేకిస్తూ సాగించిన పోరు ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా పేదలకు 10 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని వివరించారు. రాష్ట్రంలో పోలీసులు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు నియంతల్లా వ్యవహరిస్తున్నారని, సీఎం కేసీఆర్‌కు నిజాం రాజు ఆదర్శమైతే, రాష్ట్రంలోని పోలీసులకు, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులకు కేసీఆర్‌ ఆదర్శమని విమర్శించారు. తెలంగాణలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛలేదని, ఎవరికి స్వతహాగా మాట్లాడే హక్కులేకుండా పోయిందని దుయ్యబట్టారు. 

ఖమ్మంలో పోలీసులు నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నారని, అత్యుత్సామంతోనే కంచె ఐలయ్యను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తరలించారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతులై ఓటు ద్వారా సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నందున కేసీఆర్‌కు ఇప్పుడు బీసీలు గుర్తుకువస్తున్నారని, ముడున్నరేళ్ల పాలనలో బీసీలకు కేటాయించిన బడ్జెట్‌ ఒకటైతే అమలు జరిగింది మరొకటని ఎద్దేవా చేశారు. సమావేశంలో టీజీఎంపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యు.రవీందర్, కె.నాగరాజు, కె.గోపాల్, శరబంది తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు