మార్కెట్లకు మహాశివరాత్రి కళ

19 Feb, 2020 09:07 IST|Sakshi

నగరానికి భారీగా పూలు,పండ్ల దిగుమతి

ఈసారి ధరలు అందుబాటులోనే...

మార్కెట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా పోలీసుల చర్యలు

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి మహాశివ రాత్రి కళ వచ్చింది. పండుగ నేపథ్యంలో పూలు, పండ్ల దిగుమతి భారీగా పెరిగింది. హోల్‌సేల్‌ విక్రయాలకు అడ్డాలయిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్, గుడిమల్కాపూర్, జామ్‌బాగ్‌ తదితర మార్కెట్లు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. వందల కొద్దీ లారీల్లో పండ్లు, పూలు ఇక్కడికి వస్తున్నాయి.  శివరాత్రి పండగ రోజు నగర ప్రజలు ఎక్కువ శాతం ఉపవాసం ఉండి..ఎక్కువగా పండ్లు ఆరగిస్తారు. రెండు మూడు రోజులపాటు పూజలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పూల విక్రయం కూడా అధికంగా ఉంటుంది. గతేడాది శివరాత్రి పండగ సందర్భంగా 2000 టన్నుల పండ్లు దిగుమతి కాగా పూలు దాదాపు 40 టన్నుల వరకు దిగుమతి అయ్యాయని మార్కెట్‌ అధికారులు తెలిపారు. ఈసారి కూడా ఇదే రీతిలో దిగుమతులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు పెరగడంతో పుచ్చకాయ, సంత్రా, మొసంబి, ద్రాక్షతోపాటు దానిమ్మ పండ్లు ఎక్కువగా దిగుమతి పెరిగిందని హోల్‌సేల్‌ వ్యాపారులు తెలిపారు. పూల వ్యాపారం కోటిన్నర, పండ్లు దాదాపు రూ.20 కోట్ల మేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

ధరలు యథాతథం
ఈ ఏడాది రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి సరిపడా పండ్ల దిగుమతి జరగడంతో రేట్లు ఎక్కువగా పెరగలేదు. ఇక శివరాత్రి సందర్భంగా రెండింతలు పండ్లు దిగుమతి అయ్యాయి. అయినా గత ఏడాది ఉన్న ధరలే హోల్‌సేల్‌గా ఉన్నాయని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. పుచ్చకాయ, మొసంబి, సంత్రా గత ఏడాది కంటే ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి. దీంతో గత ఏడాది కంటే పండ్ల ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయని అధికారులు చెప్పారు. శివరాత్రి పురస్కరించుకొని రిటైల్‌ ధరలు కాస్త పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పండ్లు కిలో రూ.10–రూ.20 వరకు పెంచారు.

మార్కెట్‌లో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చర్యలు  
మహాశివరాత్రి నేపథ్యంలో మారెŠక్‌ట్‌కు పండ్ల దిగుమతి పెరుగుంది. అందుకే రైతులకు ముందస్తుగానే స్థలాలు కేటాయించాం. పండ్లకు గిట్టుబాటు ధర లభించే చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మార్కెట్‌లోకి వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించి, జాగ్రత్తలు పాటిస్తున్నాం. పండ్ల వాహనాలు ఎప్పటికప్పుడు అన్‌లోడ్‌ చేయించి బయటకు పంపించడానికి కమీషన్‌ ఏజెంట్లకు ఆదేశాలు జారీ చేశాం.    – ఈ.వెంకటేశం, గడ్డిఅన్నారం మార్కెట్‌ కమిటీ,     ఉన్నత శ్రేణి కార్యదర్శి

పూల రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
శివరాత్రి పురస్కరించుకొని మార్కెట్‌కు దాదాపు అన్ని రకాల పూలు ఎక్కువ మొత్తంలో దిగుతులు జరుగుతున్నాయి. ఈ ఏడాది పూల ధరలు అంతగా పెరగలేదు. అన్ని రకాల పూల ధరలు ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయి. మార్కెట్‌కు వచ్చే పూల రైతులకు స్థలాలు ఎప్పటికప్పుడు కేటాయించి, వారికి గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు చేపట్టాం. కమీషన్‌ ఏజెంట్లు కొన్న పూలకు రైతులకు వెంటనే డబ్బులు అందుతాయి.  రైతులకు ఇంకా ఎమైనా ఇబ్బందులు ఉంటే కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని మార్కెట్‌ గోడలపై పోస్టర్లు అంటించాం.– ఎం.రవీందర్, స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి(ఎఫ్‌ఏసీ), గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ  

మరిన్ని వార్తలు