జీపీలకు నిధులు

20 Sep, 2018 11:58 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: కొత్త గ్రామపంచాయతీలకు నిధులు తొలిసారిగా నిధులు విడుదల కానున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులను పాత పంచాయతీలతోపాటు వీటికి కూడా సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో 500 జనాభా ఉన్న చిన్నగ్రామాలు, తండాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాçటు చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. గతంలో ఉన్న 265 గ్రామపంచాయతీలలోపాటు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 136 గ్రామపంచాయతీలతో కలిపితే ఈ సంఖ్య 401కి చేరింది.

 
సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. చిన్నగ్రామాలు, తండాలుగా ఉండి కొత్తగా పంచాయతీ హోదా దక్కించుకున్న జీపీలకు ఆయా మాతృపంచాయతీల నుంచి రావాల్సిన ఆస్తులకు  సంబంధించిన లెక్కలు కొలిక్కి తెచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా గ్రామపంచాయతీ ఖాతాల్లో ఎన్ని నిధులు నిల్వ ఉన్నాయనే సమాచారాన్ని జిల్లా పంచాయతీ కార్యాలయానికి రికార్డులు తెప్పించుకుంటున్నారు. ఇవి పూర్తి కాగానే జనాభా ఆధారంగా నిధుల పంపకాలు చేయనున్నారు.

14వ ఆర్థిక సంఘం నిధులు
కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.31 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జూలై 31న సర్పంచ్‌ల పదవీకాలం కూడా ముగిసింది. దీంతో నిధుల పంపకాన్ని నిలిపివేశారు. పాత గ్రామ పంచాయతీల వారిగా  నిధులు కేటాయిస్తే కొత్త గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా పోతాయని ముందస్తుగానే ట్రెజరీలో ఫ్రీజ్‌ చేశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఇప్పటికే కొత్త గ్రామ పంచాయతీలకు పీడీ అకౌంట్లను ప్రారంభించారు. వాటన్నింటికి డీడీఓ కోడ్‌లను సైతం కేటాయించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి జాయింట్‌ అకౌంట్‌ ద్వారా గ్రామ పంచాయతీల పేర్ల మీద కరెంట్‌ అకౌంట్లను తీయాల్సి ఉంది. డీడీఓ కోడ్‌ నంబర్లతో బ్యాంక్‌ అకౌంట్లను తీయగానే డబ్బులు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

నిధుల కోసం తాజా మాజీల ఎదురుచూపులు
14వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయని తెలియగానే తాజా మాజీ గ్రామ సర్పంచ్‌లు పదవీలో ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో తీర్మానాలు చేసి, ఎంబీ రికార్డుల్లో సైతం నమోదు చేశారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు డ్రా చేసుకునేందుకు 14వ ఆర్థిక సం ఘం నిధులు ఎప్పుడొస్తాయా  అని తాజా మాజీ సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ బ్యాంకు  అకౌంట్ల లో డబ్బులు జమ కాగానే తీసుకునేందుకు ప్రత్యేకాధికారుల చుట్టూ  తిరుగుతున్నారు.

మరో రెండు రోజుల్లో జమ
గ్రామ పంచాయతీల అకౌంట్లను తీయిస్తున్నాం. పీడీ అకౌంట్లు పూర్తి చేశాం. డీడీఓ అకౌంట్ల ద్వారా బ్యాంకుల్లో ఖాతాలను తెరిపిస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం నిధులను  మరో రెండు, మూడు రోజుల్లో డబ్బులను జమ చేస్తాం. – రాజారావు, ఇన్‌చార్జి డీపీఓ 

మరిన్ని వార్తలు