ఏ ఒక్కరికీ నష్టం జరిగినా సీఏఏ సవరణకు సిద్ధం

10 Jan, 2020 02:37 IST|Sakshi

రాజకీయాల కోసమే విపక్షాల విమర్శలు.. ఎన్‌పీఆర్‌పైనా విష ప్రచారం

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధాని చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేదు

మీట్‌ ది ప్రెస్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వల్ల హైదరాబాద్‌లోనే కాదు.. దేశంలోని ఏ ముస్లింకు నష్టం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇది ఏ మతానికో, ఏ వర్గానికో వ్యతిరేకం కాదన్నారు. ఏ ఒక్కరికీ నష్టం జరిగినా ఆ చట్టాన్ని సవరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే విపక్షాలు సీఏఏపై విషం చిమ్ముతున్నాయని దుయ్యబట్టారు. నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌ (ఎన్‌పీఆర్‌) పైనా విషప్రచారం చేస్తున్నాయని, ప్రజల్లో అపోహలు సృష్టించే కుట్ర పన్నుతున్నాయని మండిపడ్డారు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితో గురువారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారకభవన్‌లో మీట్‌ ది ప్రెస్‌ నిర్వహించింది. ఇందులో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు.

దేశం నుంచి ఏ ఒక్కరినీ పంపించబోం
సీఏఏతో దేశంలోని 130 కోట్ల మందిలో ఏ ఒక్కరికీ సమస్య ఉండదని కిషన్‌రెడ్డి చెప్పారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో మైనారిటీలు ఇబ్బందులు పడుతూ భారత్‌కు వచ్చిన హిందు, క్రైస్తవ, సిక్కు, బౌద్ధులకు మనదేశంలో పౌరసత్వం ఇచ్చి వారికి తోడ్పాటును అందించమే చట్టం లక్ష్యమన్నారు. అది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఈ దేశం నుంచి ఏ ఒక్కరిని పంపించేది ఉండదన్నారు. ప్రతిపక్షాల వాదనలను ముస్లిం లు పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్నారు.

సీఏఏ అమలుపై సీఎంలతో సమావేశం
సీఏఏను అమలు చేయాలని రాష్ట్రాలకు చెబుతామని, సీఎంలతో దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. జనాభా లెక్కల కోసం వచ్చే వారిని తిప్పి పంపండి, కొట్టి పంపం డి అని కొంతమంది చెప్పడం సరికాదన్నారు.

రాహుల్‌గాంధీ, మమతా బెనర్జీ ఇంటికి వెళ్లాలంటే వివరాలు ఇచ్చి, అనుమతి తీసుకొని వెళ్లాల్సిందే తప్ప, వారి ఇళ్లలోకి కిటికీల నుంచి, గోడలు దూకి వస్తే ఒప్పుకుంటారా? దేశం కూడా అలాంటిదే.. దొంగ దారిలో వచ్చే వారిని ఎలా అనుమతిస్తామని ప్రశ్నించారు. అస్సాం, బెంగళూరులో డిటెన్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు.

మరిన్ని సంస్కరణలు
మోదీ ప్రభుత్వం సంస్కరణల ప్రభుత్వమని, రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దు విప్లవాత్మక నిర్ణయమని, త్వరలో కేంద్ర మంత్రులు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించబోతున్నారన్నారు. కశ్మీర్‌లో ముందు జాగ్రత్త చర్యగా కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, ఇప్పుడు అక్కడ ప్రశాంత వాతావరణం ఉందన్నారు.

అక్కడ తొలిసారిగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నామని.. అరెస్టయిన నేతలను వీలైనంత తొందరలోనే విడుదల చేస్తామన్నారు. ఇతర దేశాల్లోని భారతీయ ఆస్తుల ధ్వంసం సంఘటనల్లో ఎన్‌ఐఏ వెళ్లి దర్యాప్తు చేసేలా చట్టంలో మార్పులు తెచ్చామన్నారు. ఇరాన్‌ అమెరికా యుద్ధ ప్రభావం మనపై ఉండదని, ఆయిల్‌ ధరలపై ప్రభావం ఉండవచ్చన్నారు.

మున్సిపోల్స్‌లో అన్ని చోట్లా పోటీ..
రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయాలని నిర్ణయించామని కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ రాజకీయాల పెత్తనం పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తమ మిత్రపక్ష ఎంఐఎం ఎజెండాను అమలు చేస్తోందన్నారు. ప్రజలు బీజేపీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఏపీ రాజ ధాని అంశం పూర్తిగా ఆ రాష్ట్ర పరిధిలోనిదేనన్నా రు. హైదరాబాద్‌ని దేశ రెండో రాజధాని చేయాలనే ఆలోచన కేంద్రానికి లేదన్నారు.

నియోజకవర్గాల డీలిమిటేషన్‌ను ఆదరాబాదరగా రాష్ట్ర విభజన చట్టంలో పెట్టారన్నారు. దానివల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమీ లేదన్నారు. దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నామన్నారు. ఇండియన్‌ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీయూడబ్ల్యూజే 2020 క్యాలెండర్‌ను కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు