గాంధీ ఆస్పత్రి నర్సింగ్‌ సిబ్బంది సమ్మె

15 Apr, 2020 10:49 IST|Sakshi

గాంధీ అవుట్‌ సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది సమ్మె నోటీస్‌ 

రెగ్యులర్‌ లేదా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని డిమాండ్‌  

నేటినుంచి కార్యకలాపాలను బహిష్కరిస్తామని వెల్లడి  

సాక్షి, సికింద్రాబాద్‌: కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో బుధవారం నుంచి విధులను బహిష్కరించనున్నట్లు అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు మంగళవారం సమ్మె నోటీస్‌ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రెగ్యులరైజ్‌ చేయాలని లేదా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 13 ఏళ్లుగా 200 స్టాఫ్‌నర్సులు అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిని విధులు నిర్వహిస్తున్నారు. ప్రతినెల వేతనాలు కూడా సక్రమంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రాణాలకు తెగించి కోవిడ్‌ విధులు నిర్వహిస్తున్న తమ సేవలను ప్రభుత్వాలు, పాలకులు, అధికారులు గుర్తించడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తమకు రూ.17,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు రూ.7,500 ఇన్‌సెంటివ్‌ ప్రకటించిన ప్రభుత్వం తమకు కంటితుడుపు చర్యగా కేవలం 10 శాతం ఇన్‌సెంటివ్‌ ప్రకటించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సులకు రూ.23,000 ఇవ్వాల్సి ఉన్నా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద పనిచేస్తున్న కొందరికి మాత్రమే అది వర్తింపజేస్తున్నారని చెప్పారు. తక్షణమే తమను రెగ్యులరైజ్‌ చేయాలని లేదా కాంట్రాక్టు పద్దతిలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీ ఆస్పత్రి ఇన్‌వార్డులో సమ్మె నోటీస్‌ అందించినట్లు అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సుల యూనియన్‌ ప్రతిని ధులు తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో అవుట్‌ సోర్సింగ్‌లో 200, రెగ్యులర్‌ స్టాఫ్‌నర్సులు 150  మంది విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది విధులు బహిష్కరిస్తే కోవి డ్‌ విధులకు తీవ్ర ఆటంకం కలగవచ్చని ఆస్పత్రికి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.

ఇది చదవండి: ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం

మరిన్ని వార్తలు