మేడ్చల్‌లో ‘గ్యాస్’ లీకేజీ కలకలం!

10 Sep, 2014 00:17 IST|Sakshi

మేడ్చల్:ఓ ప్రైవేట్ స్థలంలో జేసీబీతో పని చేయిస్తుండగా భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ పగిలిపోవడంతో సీఎన్‌జీ గ్యాస్ లీకైంది. ఈ సంఘటన మేడ్చల్‌లోని ఉమానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన లక్ష్మీనారాయణ ఉమానగర్‌లో జాతీయ రహదారి పక్కన దర్గా సమీపంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు.

ఇంటి ఆవరణలో నిలుస్తున్న వర్షం నీటిని సమీపంలోని డ్రైనేజీలోకి మళ్లించేందుకు మంగళవారం ఓ జేసీబీతో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో భూగర్భంలో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ పగిలిపోవడంతో సీఎన్‌జీ గ్యాస్ లీకైంది. ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైపులైన్ పగిలిన చోట మరమ్మతు చేసి గ్యాస్ లీకవకుండా చేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

 సీఎన్‌జీ గ్యాస్ కావడంతో మంటలు చెలరేగే ప్రమాదం లేదని వారు స్థానికులకు చెప్పి వెళ్లిపోయారు. కాగా భాగ్యనగర్ సీఎన్‌జీ గ్యాస్ పైపులైన్లు చాలా తక్కువ లోతులోంచి ఉండడంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం మేడ్చల్ బస్‌డిపో వద్ద ఓ ప్రైవేట్ వ్యక్తి జేసీబీతో పనిచేయిస్తుండగా కూడా భాగ్యనగర్ సీఎన్‌జీ గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు