దేవుడే దిక్కు!

3 Feb, 2015 09:08 IST|Sakshi

వేములవాడ రాజన్న ఆలయంలో ఆదివారం స్వామివారి దర్శనం కోసం వచ్చిన రంజిత్‌కుమార్(22) అనే యువకుడికి ఫిట్స్ వస్తే కనీసం ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేదు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్ లేదు.  చివరికి కుటుంబసభ్యులు 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
 
గతంలో వరంగల్‌కు చెందిన ఓ భక్తుడికి, ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి గుండెపోటు రావడంతో వారి కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగానే ఊపిరి ఆగిపోయింది. ఎన్నోసార్లు రాజన్న కోడెలు భక్తులపై దాడి చేసినా వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది.
 
వేములవాడ అర్బన్: ఎములాడ రాజన్న భక్తులకు అత్యవసర వేళ్లలో వైద్యం అందని ద్రాక్షలా మారింది. భక్తుల ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా.. కనీసం ప్రథమ చికిత్స అందించేందుకు కూడా ఆలయ యంత్రాగం ఆలోచించడం లేదు. కూలైన్లలో స్పృహతప్పి పడిపోయినా, ఆలయంలో కోడెలు దాడి చేసినా, మరేదైనా కారణంగా గాయాలైనా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కేవలం ఉత్సవాల సమయంలో రెండు లేదా మూడు రోజులపాటు వైద్య సేవలందించి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో కోడెల దాడి, క్యూలైన్లలో స్పృహతప్పి పడిపోవడం, ఆలయ ఆవరణలోనే గుండెపోటు రావడం లాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నా అధికారుల్లో ఇసుమంతైనా చలనం లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.
 
ప్రథమ చికిత్సకు నోచుకోని భక్తులు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేంకు ప్రతిరోజు కనీసం ఐదువేల మంది భక్తులు వస్తుంటారు. ఆది, సోమ, శుక్ర, శని వారాలతో పాటు పండగలు, ప్రత్యేక రోజుల్లో సుమారు ముప్పైవేల మంది తరలివస్తుంటారు. మహాశివరాత్రి జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతారు. దీంతో నిత్యం ఈ క్షేత్రంలో భక్తుల సందడి కనిపిస్తూంటుంది. రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులు కనీసం ఒకరోజైనా ఇక్కడే నిద్ర చేయాలనే ఆనవాయితీ కొనసాగుతోంది. గదులు లభించని భక్తులంతా ఆలయ ఆవరణలోనే సేదతీరుతారు. ఈ క్రమంలో వారికి ఆరోగ్యపరమైన సమస్య తలెత్తితే వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితే నెలకొని ఉంది. దీంతోపాటు ఉపవాస దీక్షతో రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఇందులో పిల్లలు, వృద్ధులు, వికలాంగలు ఉంటారు. ఈ క్రమంలో వయోభారంతో బాధపడే వారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడేవారు, వృద్ధులు క్యూలైన్లలో అలసిపోయి స్పృహతప్పి పడిపోవడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న ఆలయ యంత్రాంగం కనీసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
గతంలో వరంగల్‌కు చెందిన ఓ భక్తుడికి, ఆలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి గుండెపోటు రావడంతో వారి కుటుంబసభ్యులు, సహచర ఉద్యోగులు పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలోగానే కన్నుమూశారు. ఎన్నోసార్లు రాజన్న కోడెలు భక్తులపై దాడి చేసినా వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయింది. భక్తులు ఉదయం పూటనే ధర్మగుండంలో స్నానాలాచరించి ఉపవాసంతోనే స్వామి వారిని దర్శించుకోవడం శ్రేష్టంగా భావిస్తారు. ఈ క్రమంలో అనారోగ్యంతో ఉన్న కొంతమంది కిందపడిపోవడం, ధర్మగుండం వద్ద జారిపేడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇదంతా చూస్తున్న ఆలయ అధికార యంత్రాంగం భక్తులకు వైద్య సేవలందించేందుకు కనీస చర్యలకు పూనుకోవడం లేదు. భక్తుల రద్దీ సమయంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇక ఆ రాజన్నే దిక్కంటూ భక్తులు బెంబేలెత్తిపోతున్నారు.
 
అనాథలు, యాచకుల పరిస్థితి దయనీయం: రాజన్నను నమ్ముకొని అనేక మంది అనాథలు, యాచకులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కుటుంబసభ్యులకు ఆదరణకు దూరమైన పలువురు వృద్ధులు స్వామివారిపైనే భారం వేసి ఇక్కడికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాచకులు సైతం భక్తులు చేసే దానధర్మాలపైనే బతుకీడుస్తున్నారు. వీరంతా వయోభారం, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారే. ఇలాంటికి వారికి ఆలయం తరఫున వైద్యం అందించే పరిస్థితి లేకపోగా, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేక ఇప్పటికే పలువురు వృద్ధులు ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయి.
 
అందుబాటులో లేని అంబులెన్స్
రాజన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు కనీసం ప్రథమ చికిత్స అందించేందుకు కూడా దేవాదాయశాఖ సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ప్రమాదవశాత్తు భక్తులకు ఏదైనా జరిగితే వారి సంబంధీకులే స్వయంగా ఎత్తుకెళ్లాల్సిందే తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ప్రథమ చికిత్స కేంద్రంతోపాటు అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచాలని భక్తజనం కోరుకుంటున్నారు.
 
హోమియో వైద్యశాల మూతబడి మూడే
ళ్లు
రాజన్న ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించబడిన హోమియో వైద్యశాల నిరుపయోగంగా మారిందని భావించిన ఆలయ అధికారులు ఆ వైద్యశాలను మూడేళ్ల క్రితమే ఎత్తివేశారు. హోమియో వైద్యశాలతో ఆర్థిక భారం పడుతుందని దానిని శాశ్వతంగా మూసేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే హోమియో వైద్యశాల ఉన్నన్నాళ్లు ఓ డాక్డర్, ఓ కాంపౌండర్ అందుబాటులో ఉంటూ కనీసం ప్రథమ చికిత్సనైనా అందించేవారు. ఆ వైద్యశాలను మూసేసిన అధికారులు మరో సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న క్రమంలో రెండుసార్లు జరిగిన సమన్వయ కమిటి సమావేశంలో దీని ఊసెత్తకపోవడం పట్ల భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
 
వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలి
నిన్న రంజిత్‌కుమార్ అనే 22 ఏళ్ల యువకుడికి ఫిట్స్ వస్తే కనీసం ప్రథమ చికిత్స కూడా అందుబాటులో లేదు. అంబులెన్స్ లేనేలేదు. చివరికి 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. భక్తులు రద్దీగా ఉన్న సమయంలో ప్రభుత్వ వైద్యసిబ్బందినైనా అందుబాటులో ఉంచాలి.                
      - నాగుల విష్ణుప్రసాద్, స్థానిక నాయకుడు

రద్దీ సమయంలో వైద్యం అందిస్తాం
ఆలయం పక్షాన ఆసుపత్రి ఏర్పాటు చేసే అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదు. భక్తులు రద్దీగా ఉండే ఆది, సోమ, శుక్రవారాలు వైద్యులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటాం. వైద్యశాఖ సిబ్బందిని ఇక్కడ డిప్యూట్ చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తాం. భక్తులకు అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.      - దూస రాజేశ్వర్, ఆలయ ఈవో
 

మరిన్ని వార్తలు