రూ.6750 కోట్లతో సుజలం

7 Jul, 2014 03:36 IST|Sakshi
రూ.6750 కోట్లతో సుజలం
  •     గోదావరి, కృష్ణా మూడోదశ పనులు సహా బ్రాండ్ ఇమేజ్ పెంపుపై దృష్టి
  •      తాగునీటి వసతులకు రూ.5500 కోట్లు ఇవ్వండి
  •      కలుషిత జలాల నివారణకు రూ.1250 కోట్లు కేటాయించండి
  •      పురాతన పైపులైన్లు మారిస్తేనే మంచినీరు
  •      ప్రభుత్వానికి జల మండలి నివేదిక
  •      నేడు సీఎం సమీక్ష?
  • సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్‌ను విశ్వ విఖ్యాత నగరంగా తీర్చిదిద్దాలన్నా... అంతర్జాతీయ విపణిలో నగర బ్రాండ్ ఇమేజ్ పెరగాలన్నా2017 నాటికి నగరంలోని అన్ని ప్రాంతాలకు పుష్కలంగా మంచినీటిని సరఫరా చేయాలి. ఇందుకు రూ.5500 కోట్లు అవసరం (మొత్తం రూ. 6750 కోట్లు). మరోవైపు కలుషిత జలాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాల్సి ఉంది. దీనికి రూ.1250 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని జలమండలి ప్రభుత్వానికి నివేదించింది.

    మంచినీటి ఎద్దడితో జనం పడుతున్న అవస్థలు, పాతనగరం సహా నిత్యం ఏదో ఒక చోట తెలెత్తుతోన్న కలుషిత జలాల సమస్య... పరిష్కార మార్గాలు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు జలమండలి పరంగా తీసుకోవాల్సిన చర్యలు, కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకం పనుల పురోగతి... అందుకు ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం, అవసరమైన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం సచివాలయంలో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది.
     
    మంచినీటికి రూ.5500 కోట్లు...

    2017 నాటికి గ్రేటర్ జనాభా అనూహ్యంగా పెరగనుంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి, జూరాల మంచినీటిపై ఆధారపడి నూతనంగా కొన్ని నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. రాబోయే మూడేళ్లలో నగరానికి అదనంగా 10 టీఎంసీల నీటిని ఆయా జలాశయాల నుంచి తరలించాల్సి ఉంది. దీనికి రూ.5500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జలమండలి కోరింది.
     
    కలుషిత జలాల నుంచి విముక్తికి...

    కలుషిత జలాల నుంచి నగర వాసులకు విముక్తి కల్పించాలంటే నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 1156 కిలోమీటర్ల మేర పురాతన మంచినీటి పైపులైన్లను మార్చాల్సిందేనని, ఇందుకు రూ.1250 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి జలమండలి నివేదించినట్లు తెలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగర వాసులకు సురక్షిత మంచి నీరందించేందుకు రూపొందించిన వాటర్ సేఫ్టీ ప్లాన్(రక్షిత మంచినీటి ప్రణాళిక)కు గత ప్రభుత్వాలు కేవలం రూ.37 కోట్లు మాత్రమే కేటాయించడంతో పురాతన పైపులైన్లను మార్చలేకపోయినట్లు నివేదికలో పొందుపరిచారు.

    రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సైతం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విషయంలో స్పందిస్తూ.. నగర ప్రజలకు రక్షిత మంచి నీరందించడం జలమండలి బాధ్యతని పేర్కొన్న విషయాన్నీ నివేదికలో ప్రస్తావించారు. ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తేనే గ్రేటర్ సిటిజనులకుకలుషిత జలాల ముప్పు తప్పుతుందని నిపుణులు స్పష్టం చేస్తుండడం ఇక్కడ గమనార్హం.

    పాత పైపులతోనే ఈ దుస్థితి...

    గ్రేటర్‌లోని జలమండలి పరిధిలో8.10 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. నగరం నలుమూలలా ఉన్న నల్లాలకు మంచినీటిని సరఫరా చేసేందుకు 600 కిలోమీటర్ల మేర భారీ మంచినీటి సరఫరా పైపులైన్లు ఉన్నాయి. వీటి ద్వారా కాలనీలు, బస్తీలకు తాగునీరందించేందుకు మరో 7980 కిలోమీటర్ల మేర పంపిణీ (డిస్ట్రిబ్యూటరీ) పైపులైన్లు ఉన్నాయి. వీటిలో 30 ఏళ్లకు పైబడిన పురాతన లైన్లు 1156 కిలోమీటర్ల వరకు ఉన్నాయి.

    ఇందులో ఆర్‌సీసీ, ఏసీ, పీవీసీ, హెచ్‌డీపీఈ, జీఐ రకం పైపులే అత్యధికం. వీటి కాల పరిమితి ముగిసిపోవడంతోతరచూ ఏదో ఒక చోట లీకేజీలు చోటుచేసుకుంటున్నాయి. వాటి పక్కనే ఉన్న మురుగునీటి పైపులైన్ల నుంచి వెలువడే వ్యర్థజలాలు మంచినీటి పైపులైన్లలోకి చేరుతున్నాయి.

    దీంతో పాతనగరంలోని అనేక ప్రాంతాలకు తరచూ రంగుమారి, దుర్వాసన వెదజల్లే జలాలు సరఫరా అవుతున్నాయి. ఇదే తరహాలో 2009లో జరిగిన భోలక్‌పూర్ ఘటనలో కలుషిత జలాలు సరఫరా అయిన కారణంగా 14 మంది మత్యువాత పడిన విషయాన్నీ నివేదికలో ప్రస్తావించారు. ఈ పరిస్థితి సమూలంగా మారాలంటే పురాతన పైపులైన్లను తక్షణం మార్చాల్సిందేనని సూచించారు.
     
    రిజర్వాయర్లకూ చికిత్స చేయాల్సిందే..

    కలుషిత జలాల సమస్య తీరాలంటే సుదూర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, మంజీర, సింగూరు జలాలతో పాటు జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాలను నిల్వ చేస్తున్న పురాతన మంచినీటి స్టోరేజీ రిజర్వాయర్లను సైతం పునర్నిర్మించాలని జలమండలి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఎర్రగడ్డ, మారేడ్‌పల్లి, తార్నాక, బంజారా సెకెండ్ స్టేజి, అల్వాల్, లింగంపల్లి, హైదర్‌నగర్ పురాతన రిజర్వాయర్ల స్థానే కొత్తవి నిర్మాణానికి మరో రూ.100 కోట్లు అవసరమవుతాయని నివేదికలో పేర్కొన్నారు.
     
    పైపులైన్లు మార్చాల్సిన ప్రదేశాలివే..

    భోలక్‌పూర్, కవాడిగూడ, గాంధీనగర్, చార్మినార్, బహూదూర్‌పురా, చాంద్రాయణ గుట్ట, కట్టెలమండి, వినాయక్ వీధి, కుల్సుంపురా, చాదర్‌ఘాట్, దారుషిఫా, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, నాంపల్లి, ఛత్రినాక, ఫలక్‌నుమా, జహానుమా, కార్వాన్, పత్తర్‌ఘట్టీ, డబీర్‌పురా పరిధిలోని వివిధ కాలనీలు, బస్తీల్లో తక్షణం పురాతన పైపులైన్లు మార్చాల్సి ఉందని జలమండలి నివేదికలో పొందుపరిచింది.
     
    ప్రాజెక్టు పనులపైనా సీఎం సమీక్ష..
     
    గ్రేటర్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రజల దాహార్తిని తీర్చే కీలక మంచినీటి పథకాలను సకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను సైతం జలమండలి నివేదికలో పొందుపరిచింది. ఆ ప్రాజెక్టుల పురోగతిని పరిశీలిస్తే...
     
    కృష్ణా మూడో దశ..

    నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి నగర శివారులోని సాహెబ్‌నగర్ వరకు సుమారు రూ.1670 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినకృష్ణా మూడో దశ పనులు ఇప్పటివరకు 70 శాతం మేర పూర్తయినట్లు జలమండలి నివేదించింది. పథకంలో భాగంగా చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణ పురోగతి బాగుందని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఈ పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపింది.
     
    గోదావరి మంచినీటి పథకం...

    కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివారులోని శామీర్‌పేట్ వరకు రూ.3800 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి మంచినీటి పథకం పనులు ఇప్పటివరకు 70 శాతం పూర్తయినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ పథకానికి ఎదురవుతున్న అడ్డంకులు, ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం తదితర అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా శామీర్‌పేట్ ప్రాంతంలో హెరిటేజ్ రాక్ క్లియరెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.260 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
     
    గోదావరి రింగ్ మెయిన్ పనులు...

    రూ.350 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గోదావరి రింగ్ మెయిన్ పనులకు బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపాలని కోరారు.
     

మరిన్ని వార్తలు