క్రిస్మస్‌ కానుకలు సిద్ధం

18 Dec, 2019 08:13 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్‌ కానుకలను సిద్ధం చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి కుటుంబాలకు గిఫ్ట్‌ ప్యాకెట్లను అందజేయాలని, క్రిస్మస్‌ రోజు వారికి విందు ఏర్పాటు చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నాలుగు వేల గిఫ్ట్‌ ప్యాక్‌లను అధికారులు సిద్ధం చేశారు. ఒక్కో మనిషికి రూ.200 వెచ్చించి విందు భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను చర్చి పాస్టర్లకు అప్పగించారు. చర్చికి వచ్చే సభ్యుల్లో రేషన్‌కార్డుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసి మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు.

ఈ మేరకు క్రిస్మస్‌ పండుగ కిట్లతోపాటు విందు భోజనం ఏర్పాట్లపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఇటీవల కలెక్టరేట్‌లో క్రైస్తవ మతపెద్దలతో సమీక్ష నిర్వహించి పండుగ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్‌కు దుస్తుల పంపిణీ చేసి ఇఫ్తార్‌ విందులు,  క్రైస్తవులకు కానుకలను అందజేస్తోంది. ప్రభుత్వం 2014 నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తుండగా.. ఈసారి కూడా క్రిస్మస్‌కు వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కొత్త దుస్తులు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక చీర, జాకెట్, ప్యాంట్, చొక్కా, చుడీదార్‌ డ్రెస్‌మెటీరియల్స్‌తో కూడిన గిఫ్ట్‌ ప్యాక్‌లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

నియోజకవర్గానికి వెయ్యి కిట్లు..
జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాలు ఉండగా ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నాలుగు వేల గిఫ్ట్‌ ప్యాక్‌లను సిద్ధం చేసి పంపించారు. గిఫ్ట్‌ ప్యాక్‌లు పొందే లబ్ధిదారులకు క్రిస్మస్‌ రోజున నియోజకవర్గాల్లో విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరికి రూ.200 వెచ్చించి విందు భోజనం ఏర్పాటు చేయాలని, వెయ్యి మందికి రూ.2 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు.

నేటి నుంచి పంపిణీ.. 
చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, కొడిమ్యాల మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ చేతుల మీదుగా బుధవారం క్రైస్తవులకు కానుకలు అందజేయనున్నారు. ఈ నెల 21న కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చేతుల మీదుగా క్రిస్మస్‌ గిఫ్ట్‌ ప్యాకెట్లను పంపిణీకి నిర్ణయించారు. క్రిస్మస్‌ రోజు ఏర్పాటు చేసే విందు భోజనాల కార్యక్రమంలో కూడా వీరు క్రైస్తవ మతపెద్దలు, ఇతర మతాలకు చెందిన పెద్దలు పాల్గొంటారు.  

చర్చి పాస్టర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక... 
నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను చర్చి పాస్టర్లకు అప్పగించారు. చర్చికి వచ్చే సభ్యుల్లో రేషన్‌కార్డుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసి మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. కరీంనగర్‌లోనే 28 వేల మంది క్రైస్తవులు ఉండగా జిల్లా వ్యాప్తంగా వీరి సంఖ్య 50 వేల వరకు ఉంటుందని మత పెద్దలు పేర్కొంటున్నారు. వీరిలో అత్యధికులు నిరుపేదలు కాగా ప్రభుత్వం నాలుగు వేల మందికి మాత్రమే క్రిస్మస్‌ కానుకలు అందించి విందు భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై క్రైస్తవుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అన్ని ఏర్పాట్లు చేశాం
క్రిస్టియన్‌ మైనార్టీలకు పంపిణీ చేసేందుకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గిఫ్ట్‌ప్యాకెట్లు సిద్ధం చేశాం. ప్రతీ నియోజకవర్గంలో వెయ్యి మంది నిరుపేద క్రైస్తవులను ఎంపిక చేశాం. పేదరికంలో ఉండి క్రిస్మస్‌కు కొత్తబట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే ఈ కిట్స్‌ అందజేయడం జరుగుతుంది. షెడ్యూల్‌ ప్రకారం కిట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం.
– రాజర్షిషా, మైనార్టీ డెవలప్‌మెంట్‌ అధికారి   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా