రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

5 Dec, 2014 23:42 IST|Sakshi

ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో రైతు వ్యతిరేకపాలన కొనసాగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు.‘రైతుల ఆత్మహత్యలను నివారించండి-ఆర్థిక భద్రత కల్పించండి’ కార్యక్రమం పేరుతో పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న బస్సుజాత కార్యక్రమాన్ని శుక్రవారం ఇబ్రహీంపట్నంలో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పుల భారాన్ని మోయలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. రైతులు అప్పులపాలు కావడానికి ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో బడ్జెట్ ప్రకటిస్తే అందులో రైతుల ఆత్మహత్యలకు పైసా కూడా కెటాయించలేదన్నారు.

వ్యవసాయమంటే తెలియని నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. పథకం ప్రకారమే వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. ఆత్యహత్యలకు పాల్పడుతున్న రైతుకుటుంభాలను కనీసం ఓదార్చే ప్రయత్నం చేయకుండా  దారుణంగా వ్యవహరిస్తోందని అన్నారు. డిసెంబర్ 10 వరకు వివిధ జిల్లాలో నిర్వహించే బస్సుజాత కార్యక్రమం ద్వారా రైతులను సంఘటితం చేస్తామని.. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు.

జిల్లాలో పర్యటన ముగింపు తరువాత డిసెంబర్ 11న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సభలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఐ(ఎం), ఆర్‌ఎస్‌పీ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్)లిబరేషన్, ఎస్‌యూసీఐ, ఎంసీపీఐ, ఫార్వర్డ్‌బ్లాక్ తదితర వామపక్షపార్టీలు పాల్గొంటున్నాయి. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు జంగారెడ్డి, న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు రంగారావు, కోటేశ్వరరావు, నాయకులు అచ్యుతరావు, కొండిగారి రాములు, ఎం.నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు