రేషన్‌ తీసుకోని వారికి సాయం ఎలా? 

5 May, 2020 01:21 IST|Sakshi

ప్రభుత్వానికి విన్నవించిన పౌర సరఫరాల శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వరుసగా మూడు నెలలు రేషన్‌ బియ్యం తీసుకోని వారికి రూ.1,500 సాయం నిలిపివేతపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి పూర్తిగా సాయాన్ని నిలిపివేసిన పౌర సరఫరాల శాఖ, లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో పునః పరిశీలన చేయనుంది. దీనికి సంబంధించిన ఫైలును ప్రభుత్వ పరిశీలనకు పంపింది. రాష్ట్రంలో 87.54 లక్షల కుటుంబాలు ఉండగా, గడిచిన జనవరి నుంచి మూడు నెలలుగా రేషన్‌ తీసుకోని కుటుంబాల సంఖ్య 6 లక్షల వరకుందని పౌర సరఫరాల శాఖ గుర్తించింది. ప్రభుత్వం 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఏప్రిల్‌ నెలలో 79.60 లక్షల కుటుంబాలు రేషన్‌ తీసుకోగా, మరో 7.94 లక్షల కుటుంబాలు తీసుకోలేదు. ఇందులో గత మూడు నెలలుగా రేషన్‌ తీసుకోని వారూ ఉన్నారు.

ఇక ఏప్రిల్‌లో రూ.1,500 సాయం కింద 79.40 లక్షల కుటుంబాలకు రూ.1,109 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేసింది. మరికొందరికి పోస్టాఫీసుల ద్వారా సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కుటుంబాలన్నీ పోనూ మరో 6 లక్షల కుటుంబాలు పూర్తిగా రేషన్‌ తీసుకోని కుటుంబాలే ఉన్నాయి. ఈ కుటుంబాలకు రూ.1,500 ఇవ్వరాదని నిర్ణయించి, పంపిణీ నిలిపివేశారు. అయితే సాయం అందని కుటుంబాల నుంచి పౌరసరఫరాల శాఖకు విపరీతంగా వినతులు పెరిగాయి. రేషన్‌ బియ్యం తీసుకోని కారణంగా ప్రభుత్వం సాయం నిలిపివేయరాదని వారు కోరుతున్నారు. దీంతో పౌర సరఫరాల శాఖ ఇదే విషయాన్ని ప్రభుత్వానికి విన్నవించింది. సాయం నిలిపివేసిన లబ్ధిదారుల విషయంలో ఎలా స్పందించాలో తెలపాలని కోరింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని శాఖ వర్గాలు వెల్లడించాయి.  చదవండి: విమానాల్లో ఇక దూరం దూరం 

>
మరిన్ని వార్తలు