యూఎల్‌సీకి మంగళం!

13 Dec, 2014 00:13 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: యూఎల్‌సీ (పట్టణ భూ గరిష్ట పరిమితి) భూములపై నెలకొన్న వివాదాలన్నిటికీ చరమగీతం పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైనవారందరికీ రెగ్యులరైజ్ చేయడం.. తక్కినవాటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోనే అత్యంత విలువైన, అత్యధిక భూములు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా సీలింగ్ భూములతో విసుగెత్తి వే సారిన భూ యజమానులకు కొంత ఊరట.. మరోపక్క ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది.

నగర శివార్లలోని 11 మండలాల్లో 3,453.70 ఎకరాల యూఎల్‌సీ భూములను కాపాడడం సర్కారుకు తలనొప్పిగా తయారైంది. ఇబ్బడిముబ్బడిగా ఆక్రమణలు జరుగుతుండడం.. వీటిని అరికట్టాల్సిన యూఎల్‌సీ విభాగానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ లేకపోవడంతో జిల్లా యంత్రాంగానికి గుదిబండగా మారింది. క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండడం.. అక్రమార్కులు కోర్టులను ఆశ్రయిస్తుండడంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎల్‌సీ స్థలాలను వీలైనంత మేర క్రమబద్ధీకరించాలని యోచిస్తోంది.

ఉభయ ప్రయోజనం..
బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ సర్కారు.. భూముల అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లు సమకూర్చుకుంటామని ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ, సీలింగ్ భూములను క్ర మబద్ధీకరించాలని నిర్ణయించింది. మరీ ముఖ్యంగా విలువైన యూఎల్‌సీకి చెందిన స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరగడం... వీటిని తొలగించడం ఆషామాషీ కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఘట్‌కేసర్ గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలిసిన  అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనే నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన సర్కారు.. ఈ జాగాల క్రమబద్ధీకరణకు మొగ్గు చూపుతోంది. తద్వారా ఖజానా నింపుకోవడమేకాకుండా ఏళ్ల తరబడి యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్న భూ యజమానులకు ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది.
 
ధరల నిర్ధారణపై మల్లగుల్లాలు
క్రమబద్ధీకరణతో దాదాపు యూఎల్‌సీ స్థలాల కథకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్న సర్కారు... కోర్టు కేసులకు కూడా త్వరితగతిన ముగింపు పలకాలని నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు పోగా మిగిలిన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు యూఎల్‌సీ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఖరారు చేయాల్సిన ధరలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూఎల్‌సీ స్థలాలు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. కనీస ధర నిర్ధారణపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే, ప్రస్తుత కనీస (బేసిక్ మార్కెట్ వాల్యూ) ధరలు భారీగా పలుకుతున్నందున.. 2008 ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది. యూఎల్‌సీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఏ ధరలను వర్తింపజేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది.

మాదాపూర్‌లో 2003లో చదరపు గజం (బేసిక్ మార్కెట్ వాల్యూ) కనీస ధర రూ.2వేలు పలకగా, 2008లో రూ.13వేలు.. ఇప్పుడు రూ.20వేలు పలుకుతుంది.
గచ్చిబౌలిలో 2003లో చదరపు గజం కనీస ధర రూ.ఒక వెయ్యి కాగా, 2008లో రూ.12వేలు.. తాజాగా రూ.15వేలుగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేస్తోంది.
 రాయదుర్గంలో 2003లో చ.గజం కనీస ధర రూ.1000 ఉండగా, 2008లో రూ.11వేలు.. ప్రస్తుతం రూ.20వేలు ఉంది.
 2008 ప్రభుత్వ కనీస మార్కెట్ విలువ ఆధారంగా రూ.7,500 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. క్రమబద్ధీకరణ ప్రక్రియను చకచకా పూర్తి చేయాలని భావిస్తోంది.
ఈ నెల 16న జరిగే అఖిలపక్ష సమావేశం అనంతరం నిర్దేశిత ధరను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు