తెలంగాణ అసెంబ్లీ ; కాంగ్రెస్‌ రచ్చరచ్చ

12 Mar, 2018 10:32 IST|Sakshi
అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన (ఇన్‌సెట్‌లో గవర్నర్‌ ప్రసంగం)

బడ్జెట్‌ ప్రతులను చింపేసి గవర్నర్‌పైకి విసిరిన సభ్యులు..

సాక్షి, హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాల తొలిరోజే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో రచ్చకు దిగింది. టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలపై నినాదాలు చేస్తూ గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. పెద్ద సంఖ్యలో లోపలికి వచ్చిన మార్షల్‌.. కాంగ్రెస్‌ సభ్యులను అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళవాతావరణం నెలకొంది. నినాదాల నడుమ గవర్నర్‌ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

సోమవారం ఉదయం 10 గంటలకు జాతీయ గీతాలాపనతో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగాన్ని చదవడం మొదలుపెట్టిన కాసేపటికే.. కాంగ్రెస్‌ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ నిల్చున్న వెల్‌లోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. అంతలోనే వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు సభ్యులు బడ్జెట్‌ ప్రతులను చింపేసి గవర్నర్‌పైకి విసిరే ప్రయత్నం చేశారు. ప్రసంగం పూర్తైన అనంతరం సభ రేపటికి వాయిదాపడింది. మార్చి 15న మంత్రి ఈటల బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

సీఎం సీరియస్‌ వార్నింగ్‌ : నేటి గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఇంతకుముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్‌ పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్‌ భావించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలే సభ్యులను.. సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెండ్ చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.

వృద్ధితో తెలంగాణ నంబర్‌ 1 : దేశంలో కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమే అయినప్పటికీ అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ప్రధమ స్థానంలో నిలిచిందని గవర్నర్‌ తెలిపారు. గడిచిన మూడేళ్లలో ఎన్నెన్నో సవాళ్లను అధిగమించామని, కాళేశ్వరం సహా ఇతర భారీ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తిచేస్తామని, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌, గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మీ, రైతులకు రుణమాఫీ తదితర పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నామని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు