‘సొంత’ బోధనతో గుర్తింపు రద్దు!

19 May, 2015 02:00 IST|Sakshi
‘సొంత’ బోధనతో గుర్తింపు రద్దు!

{పైవేటు ప్రాథమిక స్కూళ్లపై సర్కారు కొరడా
{పభుత్వ పాఠ్య పుస్తకాలను వినియోగించాల్సిందేనని స్పష్టీకరణ
దీనిపై డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ

 
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు సొంత పాఠ్య పుస్తకాలు, ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలతో విద్యా బోధన చేపడుతుండటంపై పాఠశాల విద్యాశాఖ కన్నెర్రజేసింది. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో కాకుండా ఇతర పాఠ్య పుస్తకాలతో బోధన చేపట్టినా, ప్రభుత్వ పాఠ్య ప్రణాళికను అమలు చేయకున్నా, ప్రభుత్వం తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలు చేయకున్నా ఆయా పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ప్రైవేటు పాఠశాలలు కరస్పాండెంట్లు, హెడ్‌మాస్టర్లకు తెలియజేయాలంటూ పాఠశాలల విద్యాశాఖ డీఈవోలకు సర్క్యులర్ (ఆర్‌సీ నెంబరు 419/డి/సీ అండ్ టీ/ఎస్‌సీఈఆర్‌టీ/2015) జారీ చేసింది. అలాగే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వీటన్నింటిపై ఉప విద్యాధికారులు, మండల విద్యాధికారులు, ఇతర అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్య ప్రణాళిక, పరీక్షల సంస్కరణలు అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. మరోవైపు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయం పాఠ్య పుస్తకాలను వెంటనే మార్కెట్‌లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.

సర్క్యులర్‌లోని ముఖ్యాంశాలు

విద్యార్థుల్లో విశ్లేషణ, సృజన, ఆలోచనశక్తిని పెంపొందించేలా చర్యలు చేపట్టాల్సిన ఉపాధ్యాయులు వాటిని దెబ్బతీసేలా గైడ్లు, వర్క్‌బుక్‌లు, స్టడీ మెటీరియల్‌ను కొనుక్కోవాలని విద్యార్థులకు సూచిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం. దీనిపై డీఈవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు దృష్టి పెట్టాలి. విద్యార్థులు ైగె డ్లు, వర్క్‌బుక్‌లు ఉపయోగిస్తే పాఠశాలల ప్రధానోపాధ్యాయులతోపాటు సంబంధిత పర్యవేక్షణ అధికారులే బాధ్యులు.  వారిపై కఠిన చర్యలు తప్పవు.

పాఠ్య పుస్తకాల బరువు తగ్గించేందుకు డీఈవోలు చర్యలు చేపట్టాలి. పాఠశాలల యాజమాన్యాలకు సూచనలివ్వాలి. కొన్ని జిల్లాల్లో ప్రాథమిక స్థాయిలో 10 నుంచి 12 కిలోల వరకు పాఠ్యపుస్తకాల బరువు ఉంటోంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల బరువు 15 నుంచి 17 కిలోలు ఉంటోంది. వీటి నియంత్రణపై డీఈవోలు దృష్టి సారించాలి.

ప్రతి పాఠశాలలో సహ పాఠ్య కార్యక్రమాలు కచ్చితంగా అమలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ఆర్ట్, కల్చర్ ఎడ్యుకేషన్, వ్యాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, వర్క్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ పక్కాగా అమలు అయ్యేలా చూడాలి.

క్షేత్ర స్థాయిలో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. ఇందుకోసం జిల్లా రిసోర్సు పర్సన్లను గుర్తించాలి. ప్రతి సబ్జెక్టుకు 15 మంది చొప్పున గుర్తించి పంపాలి.
 
 

మరిన్ని వార్తలు