ఆసుపత్రి ఇలాగేనా..!

11 Feb, 2019 09:36 IST|Sakshi
మరుగుదొడ్డిని పరిశీలిస్తున్న రామ్‌మనోహర్‌ రావు

హుజూరాబాద్‌రూరల్‌: ‘ఆసుపత్రి ఇలాగే ఉంటుందా..? ఎటు చూసినా అపరిశుభ్రం.. మురికికూపాలుగా వార్డులు.. దుర్వాసన వస్తున్న మరుగుదొడ్లు.. ఇలాగైతే ఎలా..? విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు..’ అంటూ జిల్లా వైద్యాధికారి రామ్‌మనోహర్‌ రావు హెచ్చరించారు. ‘పేరుకే పెద్దాసుపత్రి’ శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ స్పందించారు. హుజూరాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలోని పరిస్థితిని తెలుసుకుని నివేదిక అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి సూచించారు. ఈ మేరకు రామ్‌మనోహర్‌రావు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని ప్రతివార్డులోని రోగుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పారిశుధ్యం లోపించడంతో సిబ్బందిని పిలిపించి తీవ్ర స్థాయిలో మందలించారు. మరుగుదొడ్లను సరిగ్గా శుభ్రం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రి ఆవరణలో పందులు స్వైరవిహారం చేయడాన్ని గమనించి.. వెంటనే ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్యలోపంపై డిప్యూటీ డీఎంహెచ్‌వో రాజమౌళిని ప్రశ్నించారు. పర్యవేక్షణ ఇదేనా..? అంటూ మండిపడ్డారు. ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన రూ.5 లక్షలతో కాంటిజెంట్‌ వర్కర్లకు వేతనాలు ఇవ్వాలన్నారు. పారిశుధ్య సమస్య పునరావృతమైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓపీ (ఔట్‌పేషెంట్‌) రికార్డును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు వైద్యులు తప్పనిసరిగా ఓపీ చూడాలని సూచించారు. వైద్యులు ఎల్లప్పుడు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు.

జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన బుర్ర సాత్విక రెండోకాన్పు చేయించుకోగా.. ఆడబిడ్డ జన్మించిందని, ఆ బిడ్డ తల్లిదండ్రులు కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ చేయమంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. శంకరటపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన రాధారపు నిఖిత గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా పరీక్షించారు. ప్రభుత్వ హాస్టల్‌లో ఆర్‌బీఎస్‌కే వైద్య బృందం పరీక్షలు జరిపారా..? అని ఆరా తీశారు. లేదనడంతో వెంటనే రాష్ట్రీయ బాల్‌ స్వస్త ఆరోగ్య కార్యక్రమం వైద్యుడికి ఫోన్‌ చేసి మాట్లాడాలని డిప్యూటీ డీఎంహెచ్‌వోను ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని ప్రతిమ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమణరావు, వైద్య సిబ్బంది ఉన్నారు. 

స్పందించిన సూపరింటెండెంట్‌ 
మరోవైపు సాక్షిలో వచ్చిన కథనానికి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రమణరావు స్పందించారు. సిబ్బందితో ఆసుపత్రి పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగించారు. మురికి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో మట్టి పోయించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా