ఉచిత క్వారంటైన్‌ కల్పించండి

12 Jul, 2020 03:48 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి గల్ఫ్‌ వలస కార్మికుల వినతి

పెయిడ్‌ క్వారంటైన్‌ భారమవుతోందని ఆవేదన

మోర్తాడ్‌ (బాల్కొండ): కరోనా సంక్షోభం కారణంగా ఉపాధి కోల్పోయి ఇంటిబాట పట్టిన గల్ఫ్‌ వలస కార్మికులు రాష్ట్రంలో పెయిడ్‌ క్వారంటైన్‌ తమకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఉచితంగానే క్వారంటైన్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజులకే మనసు మార్చుకుంది. వందే భారత్‌ మిషన్‌తో పాటు చార్టర్డ్‌ విమానాల్లో రాష్ట్రానికి వస్తున్న కార్మికుల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు క్వారంటైన్‌ ఫీజును వసూలు చేస్తున్నారు. ఒక వేళ ఫీజు చెల్లించకపోతే వారి పాస్‌పోర్టులను అధికారులు తమ అధీనంలో ఉంచుకుని ఫీజు చెల్లించిన తరువాత అప్పగిస్తున్నారు.

చార్టర్డ్‌ విమానాల్లో వచ్చే వారి నుంచి మాత్రం గల్ఫ్‌ దేశాల్లోనే క్వారంటైన్‌ ఫీజును వసూలు చేస్తున్నారు. చార్టర్డ్‌ విమానాల్లో వచ్చేవారు ముందుగా క్వారంటైన్‌ ఫీజును చెల్లిస్తే ఆ సొమ్మును తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ ఖాతాకు బదిలీ చేస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్‌ను ఏడు రోజులకు కుదించారు. ఈ 7 రోజుల క్వారంటైన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల ఫీజును నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరైనా ధనవంతులు ఉంటే వారికి విలాసవంతమైన క్వారంటైన్‌ కోసం ప్రత్యేకంగా ఫీజును వసూలు చేస్తున్నారు. 

5,500 మందికే ఉచిత క్వారంటైన్‌.. 
విదేశాల నుంచి.. ప్రధానంగా గల్ఫ్‌ దేశాల నుంచి తిరిగి వచ్చే పేద కార్మికులకు ఉచిత క్వారంటైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. విదేశాల నుంచి తెలంగాణకు ఇప్పటి వరకు 21 వేల మంది వచ్చారని అధికారులు వెల్లడించిన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇందులో 14,500 మంది గల్ఫ్‌ దేశాల నుంచి.. మిగి లినవారు ఇతర దేశాల నుంచి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత క్వారంటైన్‌ సదుపాయాన్ని 5,500 మంది గల్ఫ్‌ కార్మికులు సద్వినియోగం చేసుకున్నారు. కొందరు క్వారంటైన్‌ కోసం రూ.15 వేల చొప్పున ఫీజును చెల్లించారు. మరి కొంతమంది రూ.8 వేల ఫీజుతో బయటపడ్డారు. కాగా, ఉచిత క్వారంటైన్‌ను ఈనెల 4 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు క్వారంటైన్‌ ఫీజు చెల్లింపు మరింత భారం అవుతోందని వలస కార్మికులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వం ఉచిత క్వారంటైన్‌ కల్పించాలని కోరుతున్నారు.  

ఉచిత క్వారంటైన్‌ సదుపాయం కల్పించాలి.. 
గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న తెలంగాణ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత క్వారంటైన్‌ సదుపాయం కల్పించాలి. క్వారంటైన్‌ కోసం ఫీజు చెల్లించాలంటే కార్మికులు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – ఎస్‌వీ రెడ్డి, టీపీసీసీ దుబాయ్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌

కార్మికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి.. 
గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. క్వారంటైన్‌ ఫీజును బలవంతంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి గల్ఫ్‌ దేశాల నుంచి వస్తున్న కార్మికులకు ఉచిత క్వారంటైన్‌ సదుపాయం కల్పించాలి. – గుగ్గిళ్ల రవిగౌడ్, గల్ఫ్‌ జేఏసీ కన్వీనర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు