కొనసాగుతున్న ఉపరితల ద్రోణి

12 Jul, 2020 03:51 IST|Sakshi

రెండు రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర–దక్షిణ ఉపరితల ద్రోణి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ప్రభావం దక్షిణ ద్వీపకల్పంపై చురుగ్గా కొనసాగుతోంది. ద్రోణి ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు కోస్తా, రాయలసీమలపై చురుగ్గా కదులుతున్నాయి. వీటన్నింటి ప్రభావంతో.. నేడు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే 13, 14 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. గడిచిన 24 గంటల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిశాయి. అమలాపురంలో 10 సెం.మీ, చిత్తూరులో 6, పాలకోడేరులో 5, రాయచోటిలో 5, కైకలూరు, భీమవరం, అచ్చంపేట, రాజంపేట, పుంగనూరు, పాలసముద్రంలలో 4 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు