హజ్‌యాత్ర-14కు ఏర్పాట్లు

29 Aug, 2014 01:27 IST|Sakshi
  •     వచ్చేనెల 12న యాత్రికుల క్యాంప్
  •      రుబాత్ వ్యవహారంపై సీఎంతో కలిసి సౌదీ పర్యటన
  •      డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి    
  • సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్ర -2014కు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ వెల్లడించారు. గురువారం హజ్‌హౌస్‌లో యాత్రికుల క్యాంప్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అంతరం నిర్వహించే తొలి హజ్ క్యాంప్ కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చే స్తున్నామన్నారు.

    ఇందు కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులును విడుదల చేసిందన్నారు.  దీనిపై త్వరలో ముఖ్యమంత్రితో కలిసి సౌదీ అరేబియాలో పర్యటించి అక్కడి రాజుతో రుబాత్ ఉచిత వసతి, ఇతర ఏర్పాట్లపై చర్చించనున్నట్టు చెప్పారు. నిజాం పాలనలో అక్కడ నిర్మించిన రుబాత్‌తో పాటు అన్యాక్రాంతానికి గురైన మిగితా వసతి భవనాల పునరుద్ధరణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హామీ ఇచ్చారు. మొత్తం 30 శాఖల సమన్వయంతో జరిగే ఏర్పాట్లపై ఈనెల 30 సమావేశం నిర్వహస్తామని తెలిపారు. హజ్‌హౌస్‌లో యాత్రికుల క్యాంప్ వచ్చే నెల 12న ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 14న తొలి ఫ్లైట్ బయలుదేరుతుందన్నారు. సెప్టెంబర్ 28వ తేదీ వరకు మొత్తం 18 విమానాల్లో యాత్రికులు సౌదీకి వెళతారన్నారు.

    యాత్రికులతో ప్రభుత్వ వలంటీర్లుగా వెళ్లేవారికి సెల్‌ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై ప్రతి నెలా హజ్‌హౌస్ సంక్షేమ, అభివృద్ధి పనులపై సమీక్షించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో స్టేట్ హజ్ కమిటీ స్పెషల్ అధికారి ఎస్‌ఏ షుకూర్, మైనార్టీ సంక్షేమ శాఖ  కమిషనర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, సీఈవో అబ్దుల్ హమీద్, మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ సుభాష్ చందర్ గౌడ్ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు