పొంగిన మూసీ: రాకపోకలు బంద్‌

3 Oct, 2017 10:42 IST|Sakshi

సాక్షి, భువనగిరి:  హైదరాబాద్‌ నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి యాదాద్రి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భాగ్య నగరంలోని వరద నీరంతా మూసీలోకి ప్రవహిస్తుంది. ఆ నీరంతా రంగారెడ్డి జిల్లా మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోకి వస్తుంది. దీంతో మూసీ నదిపై ఉన్న పలు ప్రాంతాల్లోని రహదారులన్నీ నీటి ఉధృతితో మునిగిపోయాయి. సమీప గ్రామాలకు రాకపోకలన్నీ బంద్ అయ్యాయి. పోచంపల్లి, బీబీనగర్, రుద్రవెల్లి, వలిగొండ, అమ్మనబోలు ప్రాంతాల్లో కల్వర్టులపై నుంచి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అలాగే మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం వద్ద మూసీ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 645 అడుగులు కాగా ఇప్పటికే 643.80 అడుగులకు వరద నీరు చేరింది. ఆరు గేట్లను మూడు అడగుల మేరకు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు.

బయటకు రాలేని ప్రజలు
మేడ్చల్‌ జిల్లా ఈస్ట్ ఆనంద్‌బాగ్‌లోని ఎన్.ఎం.డి.సి కాలనీ, షిరిడి నగర్, మల్కాజిగిరిలోని పటేల్ నగర్‌, దుర్గానగర్, వసంతపురి కాలనీ, మౌలాలిలోని ఆర్టీసి కాలనీలో రోడ్లపై నీటి ప్రవాహం తగ్గినా ఎన్‌ఎండీసీ కాలనీ, షిరిడి నగర్‌లో నాలా నిండి వర్షపు నీరు ఇళ్ళలోకి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం బయటకు వచ్చి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. ఈస్ట్ అనంద్‌బాగ్ లో నాలా పొంగుతున్న, లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఎం.వి.రెడ్డి, కార్పొరేటర్ ఆకుల నర్సింగ్ రావు, జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలించారు. 

మరిన్ని వార్తలు