సరూర్ నగర్‌లో భారీవర్షం

8 Sep, 2015 10:53 IST|Sakshi
సరూర్ నగర్‌లో భారీవర్షం

5.8 సెం.మీ. వర్షపాతం నమోదు
 రాష్ట్రంలో వారంపాటు వర్షాలు

 
 హైదరాబాద్: వానచినుకు కోసం పరితపిస్తున్న తెలంగాణ, ఏపీ రాష్ట్రాలపై ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. రుతుపవన ఆవర్తన ప్రభావంతో గత 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు జడివాన కురిసింది. సరూర్‌నగర్‌లో అత్యధికంగా 5.8 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. మహేశ్వరంలో 1.7 సెం.మీ., శామీర్‌పేట్‌లో 1 సెం.మీ. వర్షపాతం నమోదైందని తెలిపింది. భారీ వర్షం కారణంగా సరూర్‌నగర్ పరిధిలోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల వరకు 0.32 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.  

 ద్రోణి ప్రభావంతో వానలు
 లక్షద్వీప్ నుంచి తెలంగాణ వరకూ భూ ఉపరితలంపై ఆవరించిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ తెలిపింది. ఈ పరిస్థితి మరో రెండు రోజులపాటు కొనసాగనుందని, ఆ తరువాత బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా మరో నాలుగైదు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఏపీలోని కళింగపట్నంలో 5.9, మచిలీపట్నంలో 3, అనంతపురంలో 2.65, విశాఖపట్నంలో 2.2, విజయవాడలో 2.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదు కాగా, తెలంగాణలోని హైదరాబాద్‌సహా కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.
 ఈ ఏడాది నిర్ణీత సమయానికంటే కొంచెం ముందుగానే కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు జూన్‌లో వేగంగా దేశమంతా విస్తరించిన విషయం తెలిసిందే. ఆ నెలలో దేశవ్యాప్తంగా సగటు కంటే ఎక్కువ మోతాదులో వర్షాలు కురిశాయి కూడా. అయితే ఆ తరువాత పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. కీలక సమయంలో వానలు ముఖం చాటేశాయి. జూలై, ఆగస్టుల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
 
 

మరిన్ని వార్తలు