నగరంలో హై అలర్ట్‌

6 Aug, 2019 11:24 IST|Sakshi
చార్మినార్‌ వద్ద పోలీసు బందోబస్తు

కశ్మీర్‌ పరిణామాలతో అప్రమత్తం  

సమస్యాత్మక ప్రాంతాల్లోఅదనపు బలగాలు

క్షేత్రస్థాయిలో గస్తీ ముమ్మరం   

వారం రోజులు కొనసాగే అవకాశం  

ర్యాలీలు, సభలకు అనుమతుల్లేవ్‌  

పరిస్థితులపై ముగ్గురు కమిషనర్ల సమీక్ష

సాక్షి, సిటీబ్యూరో: కశ్మీర్‌ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హై అలర్ట్‌ ప్రకటించింది. దీంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముగ్గురు కమిషనర్లు స్వయంగా పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ అలర్ట్‌ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పాతబస్తీలో మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అవసరమైన, సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దింపిపటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిటీ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, సీసీఎస్, సిట్, స్పెషల్‌ బ్రాంచ్, టాస్క్‌ఫోర్స్, సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్, టీఎస్‌ఎస్పీ బలగాలను మోహరిస్తున్నారు. ఈ బందోబస్తు ఏర్పాట్ల నేపథ్యంలో పోలీసు విభాగంలోని సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అన్ని స్థాయిల అధికారులు, అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉండాలంటూ ‘స్టాండ్‌ టు’ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా ఇప్పటికే నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మూడు కమిషనరేట్లలో ఎక్కడా ర్యాలీలు, సభలు తదితరాలు నిర్వహించరాదని.. అలాంటి వాటికి అనుమతులు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేశారు. అనుమానిత/సున్నిత/సమస్యాత్మక ప్రాంతాలు, కొందరు వ్యక్తులపై నిఘా పెట్టడానికి పెద్ద ఎత్తున పోలీసులను మఫ్టీలో మోహరించారు. గతంలో కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలకు ఒడిగట్టిన వ్యక్తులను అనునిత్యం వెంటాడటానికి షాడోటీమ్‌లను ఏర్పాటు చేశారు. క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను అన్ని వేళలా అందుబాటులో ఉంచుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ అవసరమైన చోట్ల పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా పక్కా బందోబస్తు, భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఉన్నతాధికారులందరూ అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటూ... ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డీజీపీ కార్యాలయంతో అనుసంధానం ఏర్పాటు చేసుకొని పని చేస్తున్నాం’ అని ఉన్నతాధికారులు ప్రకటించారు.

పాతబస్తీకి రామగుండం సీపీ   
ప్రస్తుతం రామగుండం పోలీసు కమిషనర్‌గా ఉన్న సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వి.సత్యనారాయణను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పాతబస్తీకి పంపారు. రామగుండం వెళ్లడానికి ముందు సుదీర్ఘకాలం దక్షిణ మండల డీసీపీగా విధులు నిర్వర్తించిన ఈయన అనేక కీలక ఘట్టాలను ప్రశాంతంగా గట్టెక్కించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న డీజీపీ కశ్మీర్‌ పరిణామాల నేపథ్యంలో సత్యనారాయణను సోమవారం హుటాహుటిన రప్పించారు. పురానీహవేలీలోని కమిషనర్‌ కార్యాలయంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌తో కలిసి బస చేస్తున్న ఈయన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోపక్క తాజా పరిణామాల నేపథ్యంలో సోషల్‌ మీడియా ద్వారా వివిధ రకాలైన పుకార్లు షికార్లు చేస్తాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ సహా ఇతర సోషల్‌ మీడియాలపై నిఘా ఉంచడానికి సైబర్‌ క్రైమ్‌ పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేసినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.  

ముస్లిం ధార్మిక సంస్థల వ్యతిరేకత...   
జమ్మూకశ్మీర్‌ పరిణామాలపై నగరవాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా... మరికొందరు తప్పుపడుతున్నారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ముస్లిం ధార్మిక సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం ముస్లిం సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. అదే విధంగా కశ్మీర్‌ నుంచి నగరానికి ఇక్కడి చదువుకుంటున్న విద్యార్థుల్లోనూ భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు మద్దతు పలుకుతుండగా... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.  

పాతబస్తీలో భారీ బందోబస్తు
యాకుత్‌పురా: జమ్మూకశ్మీర్‌ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాతబస్తీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లాల్‌దర్వాజా మోడ్, హరిబౌలి చౌరస్తా, బీబీబజార్‌ చౌరస్తా, యాకుత్‌పురా బడాబజార్, దారుషిఫా, గౌలిపురా మీర్‌కా దయారా తదితర ప్రాంతాల్లో పోలీసులు బలగాలు మోహరించారు. లాల్‌దర్వాజా మోడ్‌ వద్ద స్థానిక పోలీసులతో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉన్నతాధికారుల ఆదేశానుసారం బందోబస్తు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు