ఒకేసారి ఎలా క్రమబద్ధీకరిస్తారు? 

4 Oct, 2018 01:47 IST|Sakshi

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: కాంట్రాక్టు ఉద్యోగులందరినీ హోల్‌సేల్‌గా ఎలా క్రమబద్ధీకరిస్తారని బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఇలా క్రమ బద్ధీకరణ ఉత్తర్వులివ్వడం వెనుక ఉన్న హేతుబద్ధత ఏమిటని నిలదీసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను ఎలా పడితే అలా క్రమబద్ధీకరించడానికి వీల్లేదని.. ఈ విషయంలో కర్ణాటక వర్సెస్‌ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరిన్ని వ్యాజ్యాలకు వర్తింపజేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెలంగాణ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 16ను సవాల్‌ చేస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్‌.గోవిందరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. హోల్‌సేల్‌గా కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసులను ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.  
 
దివ్యాంగులకు ప్రభుత్వ ఆఫీసుల వద్ద ర్యాంప్‌లు 
ఇద్దరు సీఎస్‌లకు హైకోర్టు నోటీసులు  
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ర్యాంప్‌లు ఏర్పాటు చేసే అంశంపై వివరణ ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దివ్యాంగుల చట్టం–2016 ప్రకారం విద్య, వైద్య, రవాణా, పోలీస్, కోర్టులు తదితర ప్రదేశాల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలన్న నిబంధన అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ డి.నరసింహాచారి దాఖలు చేసిన పిల్‌ను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ర్యాంప్‌ల ఏర్పాటును న్యాయ సేవాధికార సంస్థ పరిశీలించాల్సిన బాధ్యత ఉందంటూ విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు