చార్మినార్‌ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్‌పై.. ఎలాంటి కఠిన చర్యలు వద్దు: హైకోర్టు

29 Nov, 2023 08:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున చార్మినార్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మేఘా రాణి అగర్వాల్‌తో పాటు పవన్‌ మిస్త్రాపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ర్యాలీలో జరిగిన వివాదంపై వివరణ ఇచ్చేందుకు వారు సిద్ధంగా ఉన్నందున, వారి వివరణ వినాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వెలువడిన నాటి నుంచి 3 రోజుల్లో సీఆర్‌పీసీ 41ఏ నోటీసులకు వివరణ ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది. 

హైదరాబాద్‌ హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌లో తమపై దాఖలైన కేసులో అరెస్టు సహా ఇతర చర్యలు చేపట్టకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ మేఘా రాణి అగర్వాల్‌తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ న్యాయవాది అంజలి అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లలో ఒకరైన మేఘా రాణి అగర్వాల్‌ చార్మినార్‌ నుంచి పోటీ చేస్తున్నారని, ఈ నెల 9న నిర్వహించిన ర్యాలీ సందర్భంగా కొంత గందరగోళం చోటుచేసుకుందన్నారు. 

ర్యాలీలో గందరగోళంపై ఎండీ.జాఫర్‌ ఖాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పిటిషనర్లపై కేసు నమోదైంది. 22న పిటిషనర్లకు పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పోలీసులు అరెస్టు సహా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. వివరణ ఇచ్చేందుకు వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశిస్తూ, పిటిషన్‌లో వాదనలను ముగించారు.

మరిన్ని వార్తలు