3 నెలల్లో పంచాయతీ

12 Oct, 2018 01:39 IST|Sakshi

ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం

‘ప్రత్యేక’ పాలన రాజ్యాంగ విరుద్ధమని మండిపాటు

ఎన్నికలు నిర్వహించకపోవడం ఏకపక్ష నిర్ణయమేనని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గడువు ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకాధికారుల పాలనను కొనసాగిస్తుండటాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేకా ధికారులను కొనసాగిస్తుండటం సర్కారు ఏకపక్ష నిర్ణయం, రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడంలేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచంద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన వ్యాజ్యాలను విచారించిన ఆయన గురువారం తీర్పు వెలువరించారు. ఈ ఎన్నికలు జరగకపోవడం వెనక ఎన్నికల సంఘం అలసత్వం కూడా ఉందని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. అయితే.. అప్పటి వరకు ప్రత్యేకాధికా రులు తమ విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రభుత్వ సహకారం లేకనే..
గడువు ముగిసిన పంచాయతీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ.. తెలంగాణ సర్పంచుల సంఘం హైకోర్టులో పిటిషన్‌ వేసింది. పలువురు సర్పంచులూ కోర్టును ఆశ్రయిం చారు. ఈ వ్యాజ్యాలపై తీర్పును వెలువరించిన జస్టిస్‌ రామచంద్రరావు.. బీసీ జనాభా గణన మొద లు ఓటర్ల జాబితా తయారీ వరకు అనేక అంశాల్లో ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిం చలేదని అర్థమవుతోందన్నారు. ఎన్నికలు జరపడం వీలుకాదంటూ.. ఎన్నికల సంఘానికి లేఖ రాసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలు నిర్వహిం చడం తప్పనిసరని,  ఏ కారణాలున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుం దన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సహకారాన్ని గవర్నర్‌ నుంచి తీసుకోవాలని ఈసీకి స్పష్టం చేశారు. కాగా, తీర్పును ధర్మాసనం ముందు సవాల్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు