ఢిల్లీలో కాదు.. ఎన్నికలు హైదరాబాద్‌లోనే..

2 Feb, 2020 15:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి హైడ్రామా కొనసాగుతోంది. ఈ నెల 9న జరగబోయే ఎన్నికలను అడ్డుకుంటామని జయేష్‌ రంజన్‌ ప్యానల్‌ అంటోంది. రిటర్నింగ్‌ అధికారి చంద్రకుమార్ నియామకం చెల్లదని చెబుతోంది. మాజీ న్యాయమూర్తి కేసీ.భానును మొదట రిటర్నింగ్ అధికారిగా నియమించి, అనంతరం తెర మీదకి మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్‌ను తీసుకురావటాన్ని తప్పుబడుతోంది.  ఢిల్లీ పెద్దల సహకారంతో కొందరు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నారని జయేష్ రంజన్ ప్యానెల్ ఆరోపిస్తోంది.

ఢిల్లీలో కాదు.. ఎన్నికలు హైదరాబాద్‌లోనే..
‘తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఎన్నికలు ఢిల్లీలో కాదు.. హైదరాబాద్‌లోనే జరిగి తీరతాయ్‌’ అని తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావు అన్నారు. ఒలంపిక్‌ ఎన్నికల విషయంలో నెలకొన్న పరిణామాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..  రిటర్నింగ్ అధికారిగా చంద్రకుమార్ నియామకంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. జయేష్ రంజన్ నామినేషన్  తిరస్కరించటం అనైతికమని తెలిపారు. నామినేషన్ తిరస్కరించటానికి గల కారణాలు చంద్రకుమార్ ఇప్పటికీ చెప్పటంలేదని, రిటర్నింగ్ ఆఫీసర్‌గా చంద్రకుమార్‌ను ఎవరు నియమించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చదవండి : ఆ ఇద్దరి నామినేషన్లు తిరస్కరణ..

>
మరిన్ని వార్తలు