‘మోదీ వర్సెస్‌ రాహుల్‌’

16 Feb, 2019 01:48 IST|Sakshi

కాంగ్రెస్, బీజేపీల మధ్య పోరుగానే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నిర్ణయం

 ఆదిలాబాద్, కరీంనగర్,పెద్దపల్లి, నిజామాబాద్,జహీరాబాద్, వరంగల్‌లోక్‌సభ స్థానాలపైసమీక్ష

 ముగ్గురేసిఆశావహుల పేర్లతో జాబితా ఇవ్వాలని జిల్లా నేతలకు సూచన

సాక్షి, హైదరాబాద్‌:  రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టడం, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు పోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ ఎన్నికలు పూర్తిగా ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్యే ఉంటాయన్న భావనను ప్రజల్లోకి బలం గా తీసుకెళ్లేవిధంగా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేసింది. పార్లమెంట్‌ ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్‌ లోక్‌సభ స్థానాలపై విడతలవారీగా గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హోటల్‌లో సమీక్షలు జరిపింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఆయా నియోజకవర్గాల ముఖ్యనేతలు ఈ భేటీకి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహం, నేతల మధ్య సమన్వయం, అభ్యర్థుల ఎంపిక పార్టీ మేనిఫెస్టో తదితరాలపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉంటుందని, కాంగ్రెస్‌ను గెలిపించి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలని నేతలు సూచించారు. ఎన్నికల హామీలను అమ లు చేయడంలో మోదీ విఫలమయ్యారని, మతపరమైన రాజకీయాలతో మైనార్టీలను భయపెడుతున్నారనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మైనార్టీలను అభద్రతాభావంలోకి నెట్టి వేస్తున్న తీరును, నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలపై పడిన, పడుతున్న భారాన్ని వివరించాలన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ 2 లక్షలు కూడా కల్పించలేదని, దీనిపై యువత లో అవగాహన కల్పించాలన్నారు. రాహుల్‌ ప్రధాని అయితే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ లు నెరవేర్చలేదనే విషయాలు ప్రచారం చేయా లన్నారు. డీసీసీలు, ముఖ్యనేతలు కలసి పార్లమెంట్‌ స్థానాలకు ముగ్గురేసి ఆశావహుల పేర్ల ను పంపాలని, అందులో ఒకరిని అభ్యర్థిగా హైకమాండ్‌ ప్రకటిస్తుందని కుంతియా తెలి పారు. ఈ నెల 25 లోపు అధిష్టానానికి అభ్యర్థుల జాబితా పంపిస్తామని, నెలాఖరుకు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.  

రాహుల్‌ను ప్రధాని చేయడమే లక్ష్యం కావాలి: ఉత్తమ్‌ 
బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన విభజన రాజకీయాలు చేస్తోందని ఉత్తమ్‌ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ ఉంటుందని, దేశమంతా రాహుల్‌ను ప్రధానిని చేయాలని ఎదురుచూస్తోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని, అయితే, పార్లమెంట్‌ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని తెలిపారు. రాహుల్, మోదీ మధ్యే పోరు ఉంటుందని, నేతలంతా రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. భారత సైనికులపై ఉగ్రమూకల దాడిని ఉత్తమ్‌ ఖండించారు.

మరిన్ని వార్తలు