నన్ను కూడా కాల్చి చంపండి

6 Dec, 2019 16:55 IST|Sakshi

సాక్షి, మక్తల్‌‌: తన భర్త లేకుండా బతకలేనని, తాను కూడా చనిపోతానని దిశ హత్యకేసులో నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక కన్నీటి పర్యంతమయింది. తన భర్తను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారని తెలియగానే ఆమె హతాశురాలైంది. తన భర్తను తిరిగి పంపిస్తామని తీసుకెళ్లిన పోలీసులు తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నానని, తమ పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదని మీడియా ముందు గోడు వెళ్లబోసుకుంది.

‘ఇంత ఘనమా మోసము? చిన్నవయసులో పెళ్లి చేసుకున్నాం. సమత్సరం గిట్లా ఎల్లలేదు. మా ఆయనను యాడన చంపిన్రో నన్ను తీసుకెళ్లి ఆడనే చంపండి. నేను మాత్రం బతకను సార్‌. పంపిస్తాం, మీ ఆయనను పంపిస్తామని ఇన్ని రోజులు చెప్పిండ్రు. ఇట్ల చేస్తరా? నేను మాత్రం బతకను సార్‌ మా ఆయన లేకుండా. నేను చనిపోతా సార్. గర్భవతినైన నా మొకమైనా చూసి పంపిస్తరని ఇన్ని రోజులు అనుకున్నా. మా ఆయన ఎక్కడ? ఇంత ఘనమా శిక్షా? మా ఆయనను యాడికి తీసుకెళ్లి కాల్చి చంపిన్రో నన్ను గిట్ల తీసుకెళ్లి కాల్చి చంపండి‌’  అంటూ రేణుక కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్తను తీసుకెళ్లిన వాళ్లను, అతడిని మట్టుబెట్టిన వారిని చంపాలని ఆమె కోరింది.

ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్కరే..
ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు నిందితులు తమ కుటుంబంలో ఒక్కొక్కరే కొడుకులు కావడం గమనార్హం. శుక్రవారం రాత్రి నారాయపేట జిల్లాలో మక్తల్‌ మండలం జక్లేర్‌, గుడిగండ్ల గ్రామాల్లో నలుగురి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నేరుగా శ్మశానానికి తరలించి అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు అంగీకరించారు. తమ పొలంలో అంత్యక్రియలు చేయనున్నట్టు చెన్నకేశవులు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు జక్లేర్‌, గుడిగండ్ల గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు..

అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది : సజ్జనార్‌

దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్‌

నలుగురు మృగాళ్ల కథ ముగిసింది..

‘సాహో సజ్జనార్‌’ అంటూ ప్రశంసలు..

దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు

ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు నోటీసులు

మరిన్ని వార్తలు