మా మంచి మెట్రో!

27 Sep, 2018 04:36 IST|Sakshi

ప్రయాణికుల సంతృప్తిలో తొలి స్థానం..

13 విశ్వనగరాల్లో గ్రేటర్‌ టాప్‌.. నగర మెట్రోకు మరో ఘనత

లండన్, మెల్‌బోర్న్‌లను దాటేసిన వైనం.. కియోలిస్‌ సంస్థ తాజా సర్వేలో వెల్లడి..

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ వాసుల కలల మెట్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచవ్యాప్తంగా విశ్వనగరాలుగా ప్రసిద్ధి చెందిన లండన్, మెల్‌బోర్న్, మాంచెస్టర్, బోస్టన్‌ తదితర మహానగరాల కంటే మెరుగైన మెట్రో సేవలందిస్తూ ప్రయాణికులను సంతృప్తి పరుస్తోందని తేలింది. ప్రయాణికుల సంతృప్తి, భద్రత, సౌకర్యాల విషయంలో 98 శాతం మెరుగైన స్కోరు సాధించి ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నట్లు మెట్రో ప్రాజెక్టు నిర్వహణ సంస్థ కియోలిస్‌ (ఫ్రాన్స్‌) సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. కియోలిస్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో వివిధ రకాల ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది.

ఇందులో లండన్‌ ఆటోమెటిక్‌ మెట్రో, మెల్‌బోర్న్‌ ట్రామ్‌వే, బోస్టన్‌ కమ్యూటర్‌ ట్రెయిన్, స్టాక్‌హోమ్‌ సిటీ బసెస్, లయాన్‌ మెట్రో అండ్‌ బస్‌ సర్వీసెస్, మాంచెస్టర్‌ ట్రామ్‌వే తదితర ప్రజారవాణా వ్యవస్థలను నిర్వహిస్తోంది. నగరంలో మూడు మార్గాల్లో పరుగులు తీయనున్న 57 మెట్రో రైళ్లు, స్టేషన్లు, డిపోలు, ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థ, టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ, టికెటింగ్, టికెట్ల విక్రయాలు, కమ్యూనికేషన్‌ బేస్డ్‌ ట్రెయిన్‌ కంట్రోల్‌ వ్యవస్థల నిర్వహణ బాధ్యతల కాంట్రాక్టును కియోలిస్‌ సంస్థ 2012లో దక్కించుకున్న విషయం విదితమే.  

సర్వే సాగిందిలా..
ఈ సర్వేలో ప్రధానంగా మెట్రో సేవల పట్ల ప్రయాణికులు సంతృప్తి చెందుతున్నారా.. మెట్రో సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ఎలా ఫీలవుతున్నారు.. ప్రయాణికులకు మెట్రో స్టేషన్లలో సరైన సమాచారం అందుతుందా.. సిబ్బంది వారికి సహకరిస్తున్నారా.. మెట్రో ప్రయాణం సురక్షితమని ప్రయాణికులు భావిస్తున్నారా.. తాము చెల్లించిన డబ్బుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేస్తున్నామని ప్రయాణికులు అనుకుంటున్నారా.. తదితర అంశాలపై సుమారు వెయ్యి మంది అభిప్రాయాలను కియోలిస్‌ సంస్థ పరిశీలించింది. ఈ ఏడాది
25 జూన్‌ నుంచి– జూలై 11 మధ్య కాలంలో సేకరించిన ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది.

ఎల్బీనగర్‌– మియాపూర్‌ 1.14 లక్షల మంది..
ఎల్బీనగర్‌– మియాపూర్‌ మార్గం (29 కి.మీ)లో మంగళవారం రికార్డు స్థాయిలో ప్రయాణికులు మెట్రో ప్రయాణం చేశారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 వరకు మెట్రో రైళ్లు నిండుగా రాకపోకలు సాగించినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌.రెడ్డి తెలిపారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఎల్బీనగర్‌– అమీర్‌పేట్‌ మార్గంలో ఏకంగా 69 వేల మంది మెట్రో రైళ్లలో ప్రయాణించారని చెప్పారు. ఇక మియాపూర్‌– అమీర్‌పేట్‌ మార్గంలో 45 వేల మంది రాకపోకలు సాగించారన్నారు. నిత్యం ఈ మార్గంలో సుమారు లక్షమంది రాకపోకలు సాగిస్తారని అంచనా వేస్తున్నామని చెప్పా రు. ఇక మంగళవారం నాగోల్‌– అమీర్‌పేట్‌ మార్గంలో 51 వేల మంది మెట్రో ప్రయాణం చేశారని తెలిపారు.

మరిన్ని వార్తలు