వేరుగానే ఇంటర్ పరీక్షలు!

15 Nov, 2014 10:30 IST|Sakshi
వేరుగానే ఇంటర్ పరీక్షలు!

* విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి
 
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌తో కలిపి ఉమ్మడిగా కాకుండా.. వేరుగానే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులను విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై  సచివాలయంలో గురువారం ఇంటర్‌బోర్డు, ఇంటర్ విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు.

ఈ పరీక్షలకు సంబంధించి ఇతరత్రా నిర్వహణ సమస్యలు, ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ వంటి అంశాలపై రెండు మూడు రోజుల్లో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చర్చిస్తామని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుకు న్యాయ శాఖ నుంచి ఆమోదం లభించిందని.. సీఎం కేసీఆర్ ఆమోదం లభించాక త్వరలోనే బోర్డును ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అయితే బోర్డు విభజనతో ప్రస్తుతానికి సంబంధం లేదని, ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

ఏర్పాట్లు ప్రారంభించండి
ఇప్పటివరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించకపోవడంపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ... వెంటనే ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలెట్టాలని అధికారులను ఆదేశిం చారు. ఒక్కో సబ్జెక్టుకు 12 రకాల (సెట్లు) పేపర్లు కాకుండా 2 రాష్ట్రాలకు వేర్వేరుగా పరీక్షల నిర్వహణకు వీలుగా 24 రకాల పేపర్లు రూపొందించాలన్నారు. పేపరు కొనుగోలు, ముద్రణ, అనంతరం సరఫరాకు టెండర్లు పిలవాలని.. 2 రాష్ట్రాల ఇంటర్ బోర్డులకు వేర్వేరుగా ప్రశ్న, జవాబు పత్రాలను పంపించేలా టెండర్ల నోటిఫికేషన్‌లో స్పష్టం చేయాలన్నారు.

ఈ ప్రక్రియకు కనీసం నెల పడుతుందని, ఆ లోగా తెలంగాణ ఇంటర్ బోర్డు ఏర్పాటు పూర్తవుతుందని మంత్రి అన్నారు. కాగా ప్రస్తుతం ఉమ్మడిగా సేవలందిస్తున్న ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఇన్‌చార్జి కార్యదర్శి ఉషారాణి ఈ సమావేశానికి హాజరుకాలేదు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోందని కొందరు అధికారులు పేర్కొనగా... ఆ ఉద్దేశమే ఉంటే ఆగస్టు తొలి వారంలో మొదలు కావాల్సిన పరీక్షల పనులను ఇంతవరకూ ఎందుకు ప్రారంభించలేదనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది.
 
టెన్త్ పరీక్షలపై నేడు సమీక్ష
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై శుక్రవారం మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీల ఖరారు, పరీక్షల తేదీలపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. కాంపొజిట్ కోర్సు పేపర్ రద్దు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని గురువారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

మరిన్ని వార్తలు