రోజుకు 45 పేపర్లు.. 36 స్పాట్‌ కేంద్రాలు!

7 May, 2020 00:39 IST|Sakshi

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 36 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, ఇంటర్మీడియట్‌ జిల్లా విద్యా శాఖ అధికారులు, పాఠశాల విద్యకు చెందిన డీఈవోలు పాల్గొన్నారు. రానున్న మూడు రోజుల్లో కోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ నెల 9 లేదా 10 నుంచి మూల్యాంకనం ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నారు. జవాబుపత్రాలను మూల్యాంకన కేంద్రాలకు పంపేందుకు సమయం పట్టినా, కోడింగ్‌ ఆలస్యమైనా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 12 నుంచి అసలైన మూల్యాంకనం ప్రారంభించాలని బోర్డు స్పష్టం చేసింది. చదవండి: 5 వేల కేంద్రాలు.. 60 వేల గదులు

ఆ రోజు నుంచి ఒక్కో అధ్యాపకుడు రోజూ 45 జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 6,200 మంది ప్రభుత్వ, కాంట్రాక్టు, గెస్ట్‌ లెక్చరర్లు ఉండగా, ప్రభుత్వ మోడల్‌ స్కూళ్లు, గురుకులాల్లో మరో 5 వేల మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో మరో 25 వేల మంది లెక్చరర్లు ఉన్నారు. మొత్తం 36,200 మంది వరకు లెక్చరర్లు ఉండగా.. దాదాపు 15 వేల మందితో మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారు. నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి  చేయొచ్చని భావిస్తున్నారు. ముందు ఇంటర్‌ ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారు. అవి పూర్తయిన తర్వాత ప్రథమ సంవత్సర జవాబు పత్రాల వాల్యుయేషన్‌ ఉంటుంది. విధుల్లో పాల్గొనే వారికి రవాణా, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయా లని బోర్డు నిర్ణయించింది.

లెక్చరర్లంతా పాల్గొనాలి 
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్పాట్‌ వ్యాల్యుయేషన్‌లో వీలైనంత ఎక్కువ మంది లెక్చరర్లు పాల్గొనాలి. జేఈఈ వంటి ఇతర పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ఫలితాలపై మానసిక ఆందోళన లేకుండా చూసేందుకు త్వరగా మూల్యాంకనం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం లెక్చరర్లంతా సహకారం అందించాలి. మూల్యాంకన కేంద్రాల్లో హై శానిటైజేషన్‌ ఏర్పాట్లు చేయాలి. 
– డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు   

మరిన్ని వార్తలు