పాల్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

24 May, 2019 13:05 IST|Sakshi
ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్న నాయకులు

ఐఎన్‌టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు రాజమోగిళి

ఆదిలాబాద్‌, రెబ్బెన(ఆసిఫాబాద్‌): బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడలో ఈనెల 21న మృతి చెందిన ఫిట్టర్‌ కార్మికుడు శనిగారపు పాల్‌ కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఐఎన్‌టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమోగిళి డిమాండ్‌ చేశారు. గురువారం ఖైరిగూడ ఓసీపీని సందర్శించి పాల్‌ మృతి చెందిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ప్రమాదానికి గల కారణాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాల్‌ మృతిపై యాజమాన్యం కార్మికులను పక్క దారి పట్టించే ప్రయత్నం చేసిందన్నారు.

పోస్టుమార్టం చేసే సమయంలో పాల్‌ అంతర్గత శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని దాన్ని బట్టి పాల్‌ వడదెబ్బతో మృతి చెందలేదనే అనుమానాలు నిజమయ్యాయన్నారు. ఏ కారణంతో మృతి చెందాడో యాజమాన్యం ఇప్పటి వరకు గుర్తించలేకపోవటం చేతగాని తనమన్నారు. పాల్‌ మృతిని గని ప్రమాదంగా గుర్తించి నెల రోజుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అందించాలని, అన్ని రకాల బెనిఫిట్స్‌ని సకాలంలో అందించాలని డిమాండ్‌ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఐఎన్‌టీయూసీ కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్‌ నల్లగొండ సదాశివ్, నాయకులు మాధవకృష్ణ, ప్రవీణ్‌కుమార్, ఎస్‌కే అబ్బాస్, ఎండీ గౌస్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు