అందమూ.. బంధమూ!

23 Nov, 2014 00:22 IST|Sakshi
అందమూ.. బంధమూ!

ఇస్తాంబుల్ ఎంతో ప్రత్యేకం   సంస్కృతి, ప్రగతిలో పోలిక
అదే బాటలో భాగ్యనగరి పయనం

 
 ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఆ నగరాల సొంతం. ఇస్లామిక్ వాస్తురీతులు, కట్టడాలకు ప్రసిద్ధి చెందిన నగరాలవి. ఆధునికత ను సంత రించుకొని... సేవ, వ్యాపార, వాణిజ్య రంగాలతోపాటు అభివృద్ధిలోనూ శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి. ఆ రెండు నగరాల్లో టర్కీ దేశంలో అతి పెద్దదైన ఇస్తాంబుల్ ఒకటి కాగా.. మరొకటి మన హైదరాబాద్. ఇస్తాంబుల్ తరహాలో గ్రేటర్‌లోని పర్యాటక, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ సీఎం కేసీఆర్ తరచూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇస్తాంబుల్-హైదరాబాద్ నగరాల చారిత్రక బంధం... అక్కడి విశేషాలపై   ప్రత్యేక కథనం.  
- సాక్షి, సిటీబ్యూరో
 
ఇస్తాంబుల్‌కు హైదరాబాద్‌కు మధ్య శతాబ్దాలుగా చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర నిర్మాతలు, గోల్కొండను ఏలిన కుతుబ్ షాహీల పూర్వీకులు టర్కీకి చెందినవారే. నిజాం ప్రభువు మేనకోడళ్లు నిలోఫర్, దుర్రేషహర్ కూడా టర్కీకి చెందినవారే.
 
ఇస్తాంబుల్ తరహా అభివృద్ధి అంటే...
 
ఇస్తాంబుల్‌లో రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినపుడు చారిత్రక, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లకుండా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీంతో విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వాస్తు, శిల్పం, డిజైన్లు, కళాకృతుల వంటి అంశాలపై ఆసక్తి కలిగిన వారెందరో ఆ నగరాన్ని సందర్శిస్తున్నారు. మార్కెట్‌లలో ప్రత్యేకంగా లభించే దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసే పర్యాటకుల సంఖ్యా పెరుగుతోంది. చారిత్రక కట్టడాల్లో హోటళ్లు, రెస్టారెంట్ల ఏర్పాటుతో వాణిజ్య కార్యకలాపాలూ పెరిగాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షిం చడం ద్వారా వాణిజ్యం, టూరిజం, రవాణా రంగాల పురోభివృద్ధికి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఎంతో అవసరమని చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు.
 
 ఇదీ  విశిష్టత
 
టర్కీలో అతిపెద్ద నగరం ఇస్తాంబుల్. విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన ఈ సిటీ ఆ దేశ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంపదకు నిలువెత్తు నిదర్శనం. దీని విస్తీర్ణం 5,343 చదరపు కిలోమీటర్లు. జనాభా 1.41 కోట్లు. ప్రపంచంలోనే ఆరోఅతిపెద్ద నగరం. పూర్వకాలంలో ఈ నగరాన్ని కాన్‌స్టెంట్ నోపుల్ అని పిలిచేవారు. రోమన్, బైజాంటియన్, ఒట్టోమాన్ చక్రవర్తులకు రాజధానిగా నిలిచింది. సిల్క్‌రోడ్, యురోపియన్ నగరాలకు అధునాతన రైలు సౌకర్యం, మధ్య ప్రాచ్య దేశాలతో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు దీని ప్రత్యేకత. 2012లో ఈ నగరాన్ని 11.6 మిలియన్ల విదేశీయులు సందర్శించారు. పర్యాటక పరంగా ప్రపంచంలో ఐదో స్థానాన్ని  దక్కించుకుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ప్రముఖ టర్కిష్ కంపెనీలు, మీడియా సంస్థలకు ఇది కేంద్రం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దీని వాటా మూడోవంతు. ఐదుసార్లు ఒలింపిక్ క్రీడలకు వేదికైంది.
 
వ్యాపార, వాణిజ్యం
 
ఆలివ్ ఆయిల్, పొగాకు, రవాణా వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కేంద్రాలకు హబ్. ఇస్తాంబుల్ కేంద్రంగా పనిచేస్తున్న అనేక సంస్థలు ఏటా 41.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్నాయి. మూడు పోర్టుల ద్వారా విదేశీ వాణిజ్యం సాగుతోంది. ఇందులో హైడాస్పరా, అంబ్రాలీ, జేటిన్‌బుర్నులు విశ్వవిఖ్యాతి చెందాయి. 1461 నుంచి కొనసాగుతున్న గ్రాండ్ బజార్ లో సంప్రదాయ, ఆధునిక అలంకరణ వస్తువులన్నీ లభ్యమవుతాయి. మహమూత్ పాషా బజార్, ఈజిప్షియన్ బజార్లు ఖ్యాతి పొందాయి.
 
ప్రముఖ  కట్టడాలివే..
 
హయా సోఫియా మసీదు, బాసిలికా సిస్టర్న్ కళాత్మక కట్టడం, తోప్‌కాపీ ప్యాలెస్, బ్లూ మాస్క్, ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియం, టర్కిష్ అండ్ ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియం, సులేమానీ మాస్క్, కోరా చర్చ్, గలాటా టవర్‌లు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇస్తాంబుల్‌లో 17 రాజసౌధాలు, 64 మసీదులు, 49 చర్చిలను వారసత్వ కట్టడాలుగా గుర్తించారు.  అతిపురాతన చారిత్రక మ్యూజియం ఈ నగరంలోనే ఉంది. టర్కిష్, యురోపియన్, మధ్య ప్రాచ్య వాస్తురీతులు ఇక్కడి చారిత్రక కట్టడాల్లో కనిపిస్తాయి. ఆర్ట్ మ్యూజియాలు, ఇస్తాంబుల్ మోడ్రన్, పేరా మ్యూజియం, సకిబ్ సబానిక్ మ్యూజియం, సంత్రాల్ స్టాంబుల్ కేంద్రాల్లో తీరైన శిల్ప సంపద కనిపిస్తుంది.
 
స్థానిక పాలన
 
 
ఇస్తాంబుల్ మెట్రో పాలిటన్ మున్సిపాల్టీ ఆధ్వర్యంలో నగర పాలన సాగుతోంది. దీని పరిధిలో 39 జిల్లాలు ఉన్నాయి. కుర్ధులు, గ్రీకులు, టర్కీలు, ఆర్మేనియన్‌లు, జ్యూస్‌లు ఇక్కడ నివసిస్తున్నారు.
 
వాస్తు శిల్పాలు..
 
బైజాంటియన్, ఒట్టోమాన్ వాస్తురీతులకు దర్పణంగా నిలుస్తోంది. ఆరో శతాబ్దంలో బైజాంటియన్ చక్రవర్తి జస్టినియన్ నిర్మించిన హయా సోఫియా మసీదు, యేనిక్యామి మసీదు ప్రసిద్ధి చెందాయి.
 
ప్రజా రవాణా
 
నగరంలో ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్లు ఉన్నాయి. బస్సుల కోసం బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం, రైళ్ల కోసం సంప్రదాయ రైల్వే ట్రామ్స్, మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
 
కట్టడాలను పరిరక్షించాలి..
 
గ్రేటర్‌లో వారసత్వ కట్టడాలుగా మా సంస్థ అవార్డులు ప్రకటించిన జాబితాలో సుమారు 200 చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ పది కాలాలపాటు పరి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇస్తాంబుల్‌లో మాస్టర్‌ప్లాన్ అమలులో చారిత్రక కట్టడాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. నగరంలోనూ అలాంటి చర్యలే చేపట్టాలి. వాటికి నష్టం వాటిల్లకుండానే ఆధునికీకరణ, రహదారులు, ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలు ఏర్పాటు చేయాలి.
 - అనూరాధ రెడ్డి, హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ(ఇన్‌టాక్) కన్వీనర్
 
చారిత్రక విలువలను గుర్తించాం..
 
చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాల విలువను మా ప్రభుత్వం గుర్తించింది. మాస్టర్‌ప్లాన్‌లో వీటి పరిరక్షణకు ప్రత్యేకంగా నిధులు, యంత్రాంగాన్ని కేటాయించింది. వారసత్వ కట్టడాలను వీక్షించేందుకే ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇస్తాంబుల్ వస్తుండడం గర్వకారణంగా ఉంది. చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణ దిశగానే అభివృద్ధి గమనం ఉండాలన్నది టర్కీ ప్రభుత్వ లక్ష్యం.
 - మురాద్ ఓమెర్‌గ్లో, టర్కీ కాన్సులేట్ అధికారి, హైదరాబాద్
 
ఇదీ మన హైదరాబాద్...
 
చారిత్రక కట్టడాలు, ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఇస్తాంబుల్‌ను అచ్చు గుద్దినట్లు పోలి ఉండే నగరం హైదరాబాద్ అంటే అతిశయోక్తి కాదు. మన గ్రేటర్ నగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జనాభా కోటికి చేరువవుతోంది. సమతుల వాతావరణంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోన్న గ్రేటర్‌లోనూ ఇస్తాంబుల్‌ను పోలిన చారిత్రక కట్టడాలు బోలెడున్నాయి. గోల్కొండకోట, చార్మినార్, ఓయూ, మక్కా మసీదు, కుతుబ్‌షాహీ సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్, హుస్సేన్‌సాగర్ ఇలా 200కుపైగా చారిత్రక కట్టడాలకు నెలవిది. ఇటీవల రహదారుల విస్తరణ, మెట్రో ప్రాజెక్టు, మాస్టర్‌ప్లాన్ పనులతో కొన్ని చారిత్రక కట్టడాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వీటికి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం యత్నిస్తోంది. మన నగరంలోనూ ఇస్తాంబుల్ తరహాలో మూసీకి ఆవల, ఈవల రెండు ప్రాంతాల్లోనూ భిన్నమైన సంస్కృతి నెలకొంది. పాతనగరంలో చారిత్రక ఆనవాళ్లు బోలెడున్నాయి. ఇక హైటెక్ సిటీ, శివార్ల విషయానికి వస్తే ఆకాశమే హద్దుగా సేవ, వ్యాపార, వాణిజ్య, రియల్టీ రంగాలు విస్తరిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు