పుట్టకొకరు గుట్టకొకరు వెళ్లాల్సిందేనా?

19 Jan, 2017 21:02 IST|Sakshi
పుట్టకొకరు గుట్టకొకరు వెళ్లాల్సిందేనా?

కడ్తాల్‌: కాలుష్యకారక ఫార్మాసిటీ ఏర్పాటుకు వేలకొద్దీ ఎకరాల భూములు అవసరమా అని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లోని ఎస్‌ఎల్‌ఆర్‌ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన ‘ఫార్మాసిటీ భూనిర్వాసితుల ఘోస’లో ఆయన పాల్గొని మాట్లాడారు. నిబంధనల ప్రకారం భూసేకరణ జరగడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో కంటే పార్లమెంటు చట్టం ఉన్నతమైనదని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని సూచించారు. ప్రస్తుత మార్కెట్‌ ధరకు మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని, చట్టాన్ని అతిక్రమించి ఇష్టానుసారంగా భూ సేకరణ చేపట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాంతంపై ప్రేమ ఉంటే ఫార్మాకు బదులు వేరే ఇతర కంపెనీలను నెలకొల్పి అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఫార్మాసిటీలాంటి విషం వెదజల్లె కంపెనీలతో ఇక్కడి ప్రజల బతుకులు ఏం కావాలని ప్రశ్నించారు. పుట్టకొకరు గుట్టకొకరు వెళ్లాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులారా నిర్ణయం మీది, భవిష్యత్తు మీది, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. మీ హక్కులను కాపాడుకోండి అని రైతులకు పిలుపునిచ్చారు.

ఫార్మాసిటీ ఏర్పాటుతో భవిష్యత్తు తరాలకు మిగిలేది విషమేనని, పచ్చని పంట పొలాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి అన్నారు. కందుకూరు, యాచారం, కడ్తాల్‌ మండలాల రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జేఏసీ ఛైర్మన్‌ చల్మారెడ్డి, హైకోర్టు న్యాయవాది అర్జున్, టీజేఏసీ అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, కల్వకుర్తి జేఏసీ చైర్మన్‌ సదానందంగౌడ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు