సహజ బలంతోనే ఎదుగుదల

28 Nov, 2017 02:56 IST|Sakshi

రిజర్వేషన్ల వల్ల ఒరిగేదేం లేదు

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ వెల్లడి

హైదరాబాద్‌: నేచురల్‌ ఎవల్యూషన్‌ (సహజ పరిణామ క్రమంలో ఎదుగుదల) అనే అంశాన్ని తాము విశ్వసిస్తామని ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీవాసుదేవ్‌ అన్నారు. మహిళలకు 33 శాతం ప్రత్యేక రిజర్వేషన్ల కల్పన వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు.

ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) ఆధ్వర్యంలో నగరంలోని పార్క్‌ హోటల్‌లో సోమవారం నిర్వహించిన ‘ఇన్‌ కన్వర్సేషన్‌ విత్‌ సద్గురు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆయనతో చర్చాగోష్టి నిర్వహించారు. ఆమె అడిగిన పలు ప్రశ్నలకు చమత్కారంగా, సూటిగా సమాధానాలు ఇచ్చి ఆహూతులను అలరించారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రకృతి అందరికి అవకాశాలు ఇస్తుందని, ప్రతిఒక్కరూ తమ సహజ బలం గుర్తించి సహజ పరిణామక్రమంలో ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు.  

ప్రతి ఒక్కరిలో ప్రత్యేక మ్యాజిక్‌
మీలో ఏమి మిస్టిక్, మ్యాజిక్‌ ఉంది అని ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘నేను నా జేబులో నుంచి పావురాలు, ఉంగరాలు తీసి చూపితేనే మ్యాజిక్‌ ఉన్నట్లు కాదు.. ప్రతి ఒక్కరిలో ప్రత్యేక మ్యాజిక్‌ ఉంటుంది. విత్తనం మొక్కగా మారడం, పిండం శిశువుగా మారడం సహా ఈ సృష్టే పెద్ద మ్యాజిక్‌ ’అని అన్నారు. మనదేశంలో పురుష గురువులే కనిపిస్తారు.

మహిళలు కనిపించరు ఎందుకన్న ప్రశ్నకు బదులిస్తూ మనం పిల్లలు పుట్టినప్పటి నుంచే లింగ భేదాలు నూరిపోస్తూ వివక్షా పూరితంగా తయారు చేస్తున్నామన్నారు. మనం ఆడవాళ్లం కాబట్టి అవకాశాలు రావడం లేదనే భావన విడనాడాలని, ఇషా ఫౌండేషన్‌లో దాదాపు 70శాతం మహిళా వలంటీర్స్‌ పనిచేస్తారన్నారు.  కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌వో చైర్‌పర్సన్‌ కామిని షరాఫ్, సంగీతారెడ్డి సహా పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.

పురుషుల్లోనూ అసూయ..
మహిళలకు మహిళలే శత్రువు అనే భావనపై ఏమంటారు అని అడిగిన కవితకు జగ్గీ వాసుదేవ్‌ సమాధానం ఇస్తూ అసూయలు, ఈర‡్ష్యలు సహజమని, ఇది కేవలం మహిళలకే పరిమితం కాదన్నారు. సమాజం డబ్బే లోకం అన్న రీతిలో తయారు కావడంతోనే అన్ని సమస్యలు వస్తున్నాయన్నారు. ఆధ్యాత్మిక గురువులకు రాజకీయాలెందుకన్న ప్రశ్నకు వారూ రహదారి మీదే నడుస్తారని, ట్రాఫిక్‌ ఇతర సమస్యలపై ప్రశ్నిస్తే తప్పెలా అవుతుందని బదులిచ్చారు.

మరిన్ని వార్తలు