బీసీల హక్కుల కోసం ఎందాకైనా..

24 Sep, 2023 02:10 IST|Sakshi

ఎంపీ ఆర్‌.కృష్ణయ్యతో భేటీలో ఎమ్మెల్సీ కవిత స్పష్టీకరణ

26న జలవిహార్‌లో జరిగే బీసీ సంఘాల సభకి సంఘీభావం

సాక్షి, హైదరాబాద్‌: చట్ట సభల్లో బీసీలు, బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్‌తో ఈ నెల 26న బీసీ సంఘాలు నిర్వహించే సమా వేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చట్ట సభల్లో బీసీల వాటా, హక్కుల కోసం జరిగే ఉద్యమానికి తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రకటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య శనివారం హైదరాబాద్‌లో కవితతో భేటీ అయ్యారు.

బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎంపీలు మాలోత్‌ కవిత, బోర్లకుంట వెంకటేశ్‌ నేత, ప్రభుత్వ కార్పొరేషన్‌ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, పల్లె రవికుమార్, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ భేటీలో  పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే  2014 జూన్‌లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లుపై తమ పార్టీ తీర్మానం చేసిందని కవిత గుర్తు చేశారు. నామినేటెడ్‌ పదవులు, మార్కెట్‌ కమిటీలు, పార్టీ పదవుల్లో బీసీలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పించిందన్నారు.

తెలంగాణ నుంచే బీసీ ఉద్యమం: కృష్ణయ్య
కవితతో భేటీ అనంతరం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం వద్ద ఎంపీ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. తెలంగాణ నుంచే బీసీ ఉద్యమానికి శంఖారావం పూరిస్తామని ప్రకటించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌ కల్పించటం, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ కులగణన అనే మూడు డిమాండ్లతో తమ జాతీయ ఉద్యమం కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మహిళా బిల్లును సవరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 26న జలవిహార్‌లో సదస్సు నిర్వహించిన తరువాత బీసీ రిజర్వేషన్‌ బిల్లు కోసం ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు