రేవంత్‌ది తప్పు.. ఉత్తమ్‌కే అధికారం

21 Sep, 2019 10:45 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జంగా రాఘవరెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి

జనగామ: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో భాగంగా రేవంత్‌రెడ్డి తన అభ్యర్థిని ప్రకటించుకోవడమే కాకుండా పత్రికలకు ఎక్కడం పద్ధతి కాదని జనగామ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే, రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ఒకసారి ఎంపీగా పోటీ చేసి, పీసీసీ అధ్యక్షు డిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్టేట్‌వర్కింగ్‌ ప్రసిడెంట్‌ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి వేలెత్తి చూపించడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా పనిచేసిన ఆయనకు సొంత నియోజకవర్గంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసుకునే విధంగా ఉండాలే తప్ప... బహిరంగంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. కాగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పడం లేదన్నారు.

విద్య, వైద్య, మిషన్‌భగీరథ, రైతుబంధు ఇలా అనేక హామీలను బుట్టదాఖలు చేస్తూ.. ప్రజలను అయోమయానికి గురి చేసే కార్యక్రమాలను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష రుణమాఫి ఎక్కడ పోయిందన్నారు. ప్రజలు విషజ్వరాలతో అవస్థలు పడుతుంటే సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హామీల అమలుకు కార్యరూపం దాల్చడం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని 5 ఎకరాలోపు ఉన్న రైతులకు ఇస్తామని ఓ మంత్రి అంటుంటే.. మరో మంత్రి అదేమీ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వందలాదిమంది ప్రాణత్యాగం చేసి..తెలంగాణ సాధించుకుంటే.. కల్వకుంట్ల కుటుంబం రాజ్యమేలుతోందన్నారు. సమావేశంలో డీసీసీ వైస్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, డాక్టర్‌ లక్ష్మినారాయణ నాయక్, రఘునాథపల్లి ఎంపీపీ మేకల వలరక్ష్మి, సర్పంచ్‌లు మాసపేట రవీందర్‌రెడ్డి, రమేష్, మాజీ జెడ్పీటీసీ నల్ల అండాలుశ్రీరామ్, నాయకులు ఎల్లన్న ఉన్నారు. 

మరిన్ని వార్తలు