నగలు, ఐఫోన్లంటూ మస్కా

28 Jul, 2014 04:13 IST|Sakshi
నగలు, ఐఫోన్లంటూ మస్కా
  •       ఫేస్‌బుక్ ద్వారా అమాయకులకు గాలం
  •      కస్టమ్స్ క్లియరెన్స్ ముసుగులో రూ.కోట్లు కొల్లగొట్టిన ముఠా
  •      సైబర్ పోలీసులకు చిక్కిన పాత్రధారులు
  •      పరారీలో మరో ఇద్దరు: 30 బ్యాంకు ఖాతాల సీజ్
  • సాక్షి, సిటీబ్యూరో:  కస్టమ్స్ క్లియరెన్స్ ముసుగులో కోట్లాది రూపాయలను కాజేసిన ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఫేస్‌బుక్ ద్వారా మహిళలను బుట్టలో వేసుకుని బంగారు ఆభరణాలు, ఐఫోన్లు పంపిస్తామని నమ్మించి.. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం బ్యాంకులో డబ్బులు వేయించుకుని మోసగించడం వీరి నైజం. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఐదుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వివరాలను ఆదివారం ఇన్‌చార్జి క్రైమ్ డీసీపీ జి.జానకీ షర్మిల వెల్లడించారు.
     
    ముఠా ఏర్పడిన తీరు ఇదీ..
     
    బీహార్‌కు చెందిన రహ్మత్ అలీ, మహ్మద్ తన్వీర్ అన్సారీ, షా హుస్సేన్ కూలీలు. వీరిని అదే రాష్ట్రానికి చెందిన సితారే మహ్మద్, మిట్టు గతేడాది హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తాని నమ్మించి తీసుకువచ్చారు. చందానగర్‌లో ఒక గ దిలో ఆశ్రయం కల్పించారు. వారి పేర్ల తో మాదాపూర్, చందానగర్, గచ్చిబౌలిలోని ఐసీసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సి స్, ఎస్‌బీఐ, బీఓబీలతో పాటు ఇతర బ్యాంకుల్లో నకిలీ ఓటరు కార్డులు, పాన్‌కార్డులతో ఒకొక్కరితో పది బ్యాంకు ఖాతాలు తెరిపించారు. సితారే మహ్మద్ వీరితో పాటే ఉండేవాడు. మిట్టు మా త్రం ఢిల్లీలో మకాం వేసేవాడు.
     
    ఇలా మోసగిస్తారు...
     
    ఢిల్లీలో ఉన్న మిట్టు తన పేరును పీటర్‌గా మార్చుకుని ఫేస్‌బుక్ ద్వారా మహిళలను పరిచయం చేసుకుంటాడు. వారితో ఫోన్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఆకర్షిస్తాడు. ఆ తరువాత తాను బంగారు నగలు, ఐఫోన్ ఉచితంగానే పంపిస్తానని నమ్మిస్తాడు. అయితే కస్టమ్స్ క్లియరెన్స్ కోసం కొంత డబ్బును తాను సూచించిన బ్యాంకు ఖాతాలో వేయాలని చెబుతాడు. అతడి మాటలు నమ్మి చాలామంది మహిళలు బ్యాంకులో డబ్బులు వేసి మోసపోయారు.

    ఈ క్రమంలోనే నాగోలుకు చెందిన ఓ మహిళను ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుని ఆభరణాలు, ఐ ఫోన్ పంపిస్తున్నానని మాదాపూర్ ఐసీఐసీఐ బ్యాంకులో రూ.34,000 వేయించుకున్నాడు. ఆపై యాంటీ టైస్టు ఫండ్ పేరుతో మరో రూ.1,76,000 తీసుకున్నాడు. అయితే, ఎంతకూ నగలు, ఐఫోన్ రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన సదరు మహిళ గతనెల సైబర్‌క్రైమ్ ఏసీపీ ప్రతాప్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది.

    రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ ఎస్.రాజశేఖరరెడ్డి మాదాపూర్, గచ్చిబౌలిలోని ఆయా బ్యాంకుల్లో ఖాతాలను పరిశీలించగా బీహార్‌కు చెందిన రహ్మత్ అలీ, మహ్మద్ తన్వీర్ అన్సారీ, షా హుస్సేన్‌ల పేర్లు వెలుగు చూశాయి. ఆదివారం వారింటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. రూ.1,10,000 తో పాటు ఏటీఎం, పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన సితారే మహ్మద్, మిట్టు కోసం గాలిస్తున్నారు. విచారణలో ఈ ముఠా రూ.కోట్లను కొల్లగొట్టినట్టు గుర్తించారు. పట్టుబడ్డ ముగ్గురికి ప్రధాన సూత్రధారులు నెలలకు రూ.8000 ఇచ్చేవారిని తేలింది.
     

మరిన్ని వార్తలు