ఇంటర్ పరీక్షలకు ఉమ్మడి కమిటీ!

22 Nov, 2014 01:13 IST|Sakshi
  • వేర్వేరు పరీక్షలపై గవర్నర్ విముఖత!
  • సాక్షి, హైదరాబాద్: ఇరు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అధికారులతో కూడిన ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసి ఇంటర్మీడియెట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించేందుకు అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

    రెండు రాష్ట్రాల మంత్రులు గంటా శ్రీనివాసరావు, కె .జగదీష్‌రెడ్డిలతో ఇటీవల గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్లో నిర్వహించిన సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను అనుసరించి ఈ ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తేనే ఉమ్మడి కమిటీ, ఉమ్మడి పరీక్షలకు వీలుంటుంది.

    గురువారం ఇద్దరు మంత్రుల భేటీ జరిగి ఉంటే దీనిపై చర్చ జరిగి ఉండేది. కానీ ఆ సమావేశం జరగకపోవడంతో ఈ ప్రతిపాదనలపై ప్రాథమిక స్థాయి చర్చ కూడా సాగలేదు. ఇరు ప్రభుత్వాలు అంగీకారానికి వస్తే రెండు ప్రభుత్వాల ఉన్నతాధికారులతో ఉమ్మడి కమిటీని ఏర్పరచి ఇంటర్మీడియెట్ ఉమ్మడి పరీక్షలు నిర్వహించేందుకు అవకాశ ముంటుందని అధికారులు పేర్కొన్నారు.
     
    విభజన చట్టంలోని సెక్షన్ 95లోని అంశాల ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఉమ్మడిగానే జరగాలని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. వేర్వేరుగా నిర్వహిస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆయన మంత్రుల భేటీ సందర్భంగా స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. గవర్నర్ అభిప్రాయం ఉమ్మడి పరీక్షల నిర్వహ ణకే అనుకూలంగా ఉండడంతో అధికారులు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నా... ఇరు ప్రభుత్వాలు ఏమేరకు అంగీకరిస్తాయోనన్న సందేహంలో ఉన్నారు.

మరిన్ని వార్తలు