ఈ స్టేషన్‌కు ఏమైంది..?

13 Jan, 2020 07:17 IST|Sakshi
జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌

జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముడుతున్న వివాదాలు

బంజారాహిల్స్‌: లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారులు... అటాచ్‌మెంట్‌లు.. సస్పెన్షన్‌లు.. గడువు తీరకుండానే అర్థాంతరపు బదిలీలు... సిబ్బందిపై కోల్పోతున్న పట్టు... ఎవరికివారే యుమునాతీరే చందంగా వసూల్‌ రాజాలు... ఇదీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ తాజా పరిస్థితి. గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌ను వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. మూడురోజుల క్రితం ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ పోలీస్‌స్టేషన్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవలే పోలీస్‌స్టేషన్‌ నుంచి ఒకేసారి ముగ్గురు ఎస్‌ఐలు అటాచ్‌ అయ్యారు. ప్రస్తుతం ఇన్‌స్పెక్టర్‌ లేకుండానే స్టేషన్‌ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పోలీస్‌స్టేషన్‌ అప్రతిష్టపాలవుతోంది.

ఉన్నతాధికారులు తరచూ క్లాస్‌లు తీసుకుంటున్నా ఇక్కడి సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. ప్రతిరోజూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేయాలంటేనే ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు వణికిపోతున్నారు. ఇటీవలే ఇద్దరు ఎస్‌ఐలు ఇక్కడ పనిచేయలేమంటూ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా స్టేషన్‌కు పదిమంది ఎస్‌ఐలు అవసరం. ప్రస్తుతం ఓ ఎస్‌ఐ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్‌కాగా కేవలం నలుగురు మాత్రమే మిగిలారు. ఆరు ఎస్‌ఐ పోస్టులతో పాటు ఒక సీఐ పోస్టు ఖాళీగా ఉంది. అడ్మిన్‌ ఎస్‌ఐ పదవి నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. క్రైమ్‌ ఎస్‌ఐ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. సరిపడ సిబ్బంది లేక పోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీనికితోడు ఉపరాష్ట్రపతి ఇదే పీఎస్‌ పరిధిలో ఉండటంతో నిత్యం వీవీఐపీల రాకపోకలు జరుగుతుంటాయి. ప్రముఖులపై కేసులు, పబ్‌లలో గొడవలు నిత్యకృత్యం. అయితే ఇంటికి కీలకమైన పోలీస్‌స్టేషన్‌లోనూ అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రక్షాళన చేయాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ క్రైమ్‌ విభాగం కూడా పడకేసింది. కేసులు ముందుకు సాగడంలేదు. ఎక్కడి ఫైళ్లు అక్కడే పేరుకుపోతున్నాయి. మరి అధికారులు ఈ స్టేషన్‌ను ఎలా బతికిస్తారో..? వేచి చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు