హైకోర్టు సీజేగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ప్రమాణం 

23 Jun, 2019 03:55 IST|Sakshi
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌. చిత్రంలో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి 

ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ నరసింహన్‌ 

కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు, న్యాయమూర్తులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. గవర్నర్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త సీజేకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు ఎండీ మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌ రెడ్డి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ కలకత్తా హైకోర్టుకు బదిలీ కావడంతో, గత మార్చి 28 నుంచి సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు