‘తూర్పు’లో ఆదరణ లేకనే పరకాలకు..

1 Oct, 2018 13:02 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి

సాక్షి, ఖిలా వరంగల్‌: కొండా దంపతుల ఆగడాలతో ‘తూర్పు’ నాయకులు, ప్రజలు విసిగిపోయార ని, ఇక ఇక్కడ ఆదరించే పరిస్థితి లేకనే వారు పరకాలకు పయనమయ్యారని ఆపద్ధర్మ డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. కొండా దంపతులు వెళ్లడంతో టీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరిందన్నారు. గ్రూపు రాజకీయాలతో పార్టీకి, నాయకులకు నష్టం చేశారని, పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. వరంగల్‌ శివనగర్‌లోని శ్రీసాయి కన్వెన్షన్‌ హాల్‌లో తూర్పు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ముఖ్యనేతల సమన్వయ సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతి థిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యారు.

ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాష్, మేయర్‌ నరేందర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాష్ట్ర మహిళా ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లం సంపత్, పార్టీ తూర్పు ఇన్‌చార్జి ఎడవెల్లి కృష్ణారెడ్డి, అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రా వు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి పార్టీ పటిష్టత, నిర్మాణంపై ఆయన  చర్చించారు. అనంతరం కార్పొరేటర్లు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేసీఆర్‌ ఆదేశాలను పాటించి అభ్యర్థి ఎవరైనా ఐక్యత ప్రదర్శించి అఖండ విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. అనంతరం డిప్యూటీ సీఎం విలేకరులతో మాట్లాడుతూ వరంగల్‌ తూర్పులో మొత్తం 20 మంది కార్పొరేటర్లు ఉంటే అందరూ పార్టీలోనే ఉన్నారని చెప్పారు.

వారు ఉద్యమంలో లేకున్నా 2014లో పార్టీ టికెట్‌  ఇచ్చిందన్నారు. ఉమ్మడి జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామనడం కాదని, వారి సీటే వారు గెలవలేరని, భారీ మెజార్టీతో చల్లా ధర్మారెడ్డి గెలుపు ఖాయమన్నారు. వీరంతా పార్టీ  అభ్యర్థి గెలుపు కోసం పనిచేయనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 7వ తేదీన ఎన్నికైన బూత్, డివిజన్‌ కమిటీలతో నియోజకవర్గ కమిటీ నియామకం, విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కమిటీ సమన్వయకర్తలు ఎంపీ బండా ప్రకాశ్, కొంపెల్లి ధర్మరాజు, సయ్యద్‌ మసూద్, మెట్టు శ్రీనివాస్, ఎడవెల్లి కృష్ణారెడ్డి  వ్యవహరించనున్నాట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. 

మరిన్ని వార్తలు