కాళేశ్వరం సొరంగాలు సిద్ధం

25 Mar, 2018 02:20 IST|Sakshi

     94.27 కి.మీ. సొరంగ పనుల్లో 89.85 కి.మీ. పూర్తి 

     మరో రెండు నెలల్లో మిగిలిన నిర్మాణాలు సిద్ధం 

     మండలికి సమర్పించిన ప్రగతి నివేదికలో మంత్రి హరీశ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి జలాలను పడావు భూములకు తరలించే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భారీ సొరంగాల నిర్మాణాలన్నీ తుది దశకు చేరుకున్నాయి. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి తరలించే నీరు దిగువన మల్లన్నసాగర్‌ వరకు ఆటంకాలు లేకుండా ప్రవాహించేలా సొరంగాలను నీటి పారుదల శాఖ సిద్ధం చేసింది. వివిధ ప్యాకేజీల పరిధిలో 94.27 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్వాల్సి ఉండగా ఇప్పటికే 89.85 కిలోమీటర్ల నిర్మాణాలు (90 శాతం పనులు) పూర్తయ్యాయి. మిగిలిన పనులు మరో 2 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం పనులు పూర్తయితే సాగునీటి రంగంలో ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్‌ గల ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రకెక్కనుంది.  

జూన్‌లో వెట్‌రన్‌! 
ఈ 149 కిలోమీటర్ల నిర్మాణాల్లో ప్యాకేజీ–6 నుంచి ప్యాకేజీ–12 వరకు టన్నెళ్ల నిర్మాణమే 94.27 కి.మీ. మేర ఉంది. ఇందులో ఇప్పటికే 89.85 కి.మీ. టన్నెల్‌ నిర్మాణం పూర్తయింది. మరో 4.42 కి.మీ. మాత్రమే మిగిలింది. ఇందులో ప్యాకేజీ–7 పరిధిలో 22.48 కి.మీ. ఉండగా, 22.36 కి.మీ. పని పూర్తయింది. ప్యాకేజీ–6లోని మొత్తం 19.06 కి.మీ. నిర్మాణం పూర్తయింది. మిడ్‌మానేరు దిగువన ప్యాకేజీలు–10, 11, 12ల పరిధిలో 32.42 కి.మీ. టన్నెల్‌ తవ్వాల్సి ఉండగా 31.54 కి.మీ. తవ్వకం పూర్తయింది. వచ్చే నెలాఖరుకు మిగతా పనులు పూర్తి కానున్నాయి. టన్నెళ్ల లైనింగ్‌ పనులు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. 94.27 కి.మీ.లలో 53.78 కి.మీ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 40 కి.మీ మేర పనులు మే చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే జూన్‌ నాటికి పనులన్నీ పూర్తి చేసి వెట్‌రన్‌కు సిద్ధంగా ఉంచేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. జూన్‌ నుంచి కనిష్టంగా రోజుకు ఒక టీఎంసీ చొప్పున 90 టీఎంసీల నీటిని నిర్ణీత ఆయకట్టుకు తరలించేలా ప్రణాళికలు వేస్తున్నారు.

రూ.80 వేల కోట్లతో.. 
కాళేశ్వరం ఎత్తిపోతలను రూ.80,400 కోట్లతో చేపట్టగా ఇప్పటివరకు రూ.60,922 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. వాటిలో ఇప్పటివరకు రూ.22,875 కోట్ల పనులు పూర్తయినట్లు శనివారం శాసనమండలిలో సమర్పించిన ప్రగతి నివేదికలో నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. వివిధ పనుల ప్రగతిని నివేదికలో పొందుపరిచారు. ఆ ప్రకారం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్‌హౌజ్‌ల పనులు 50 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఇందులో అన్నారం బ్యారేజీ పనులు 67 శాతం పూర్తయ్యాయి. ఈ 3 బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లికి నీరు తరలించి అటు నుంచి మల్లన్నసాగర్‌ వరకు తీసుకెళ్లాలంటే అప్రోచ్‌ చానళ్లు, లింక్‌ కెనాల్స్, గ్రావిటీ కెనాల్స్, టన్నెళ్లు నిర్మించాలి. మొత్తంగా 149 కిలోమీటర్ల మేర కెనాల్స్, టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు